ప్రైవేటు డిటెక్టివ్‌ల వేటలో పంజాబ్ నేషనల్ బ్యాంకు

ఇప్పటికే అనేకమంది ఫ్రాడ్ చేసి పంజాబ్ నేషనల్ బ్యాంకులో లోన్ బకాయిలు పెరగడానికి కారణమైన క్రమంలో ఆ బ్యాంకు ఓ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది.

Last Updated : Apr 25, 2018, 10:39 PM IST
ప్రైవేటు డిటెక్టివ్‌ల వేటలో పంజాబ్ నేషనల్ బ్యాంకు

ఇప్పటికే అనేకమంది ఫ్రాడ్ చేసి పంజాబ్ నేషనల్ బ్యాంకులో లోన్ బకాయిలు పెరగడానికి కారణమైన క్రమంలో ఆ బ్యాంకు ఓ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే బ్యాంకును మోసం చేసిన వారి జాబితాలో నీరవ్ మోదీ లాంటి బడా బడా వ్యాపారవేత్తలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే అలాంటి కేసులు ఆ బ్యాంకులో ఇంకా చాలా ఉన్నాయట.

ఆ కేసుల్లో భాగంగా దాదాపు రూ.57,519 కోట్ల బ్యాంకు లోన్లను రికవర్ చేయాల్సి ఉంది. అయితే అవి రికవర్ చేయాలంటే పోలీసుల మీదా, కోర్టుల మీదా ఆధారపడితే పుణ్యకాలం అయిపోతుందని భావించిన బ్యాంకు ఓ కొత్త ఆలోచనకు నాంది పలికింది. ఆ సమస్యలను పరిష్కరించడానికి ప్రైవేటు డిటెక్టివ్ ఏజెన్సీలను సంప్రదించాలని యోచించింది. అందుకు సంబంధించిన ప్రకటనలను ఇటీవలే పత్రికాముఖంగా ప్రకటించింది. ఆసక్తి కలిగిన డిటెక్టివ్ ఏజెన్సీలు మే 5, 2018 తేదికల్లా తమ దరఖాస్తులను పంపించాలని కోరింది

అయితే తాము సమస్యలను పరిష్కరించడం కోసం అత్యున్నత సేవలు అందించి.. మంచి ట్రాక్ రికార్డు ఉన్న డిటెక్టివ్ ఏజెన్సీల సహాయం మాత్రమే తీసుకోవాలని భావిస్తోంది పంజాబ్ నేషనల్ బ్యాంకు. ఈ డిటెక్టివ్ ఏజెన్సీలకు సబ్ స్టాండర్డ్, లాస్ క్యాటగరీ అకౌంట్ల వివరాలు ఇచ్చి బకాయిలు వసూలు చేసే ప్రక్రియను బ్యాంకు వేగవంతం చేయనున్నట్లు సమాచారం.

అలాగే ఈ ఏజెన్సీలకు అప్పగించే ఒక్కో కేసును పరిష్కరించడానికి వాటికి ఇచ్చే సమయం 60 రోజులు కాగా.. దానిని సమస్య జఠిలత్వాన్ని బట్టి 90 రోజుల వరకూ పెంచే అవకాశం ఉందని పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులు తెలిపారు.  

Trending News