ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై స్పందించిన రాహుల్ గాంధీ

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై స్పందించిన రాహుల్ గాంధీ

Last Updated : Dec 11, 2018, 09:55 PM IST
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై స్పందించిన రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: ఇటీవల తెలంగాణ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, మిజోరాం రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెల్లడైన నేపథ్యంలో ఇవాళ రాత్రి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ చత్తీస్‌ఘడ్, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో అప్పటికే విజయం సాధించగా మధ్యప్రదేశ్‌లో భారీ సంఖ్యలో ఆధిక్యంలో వుండటంపై రాహుల్ గాంధీ ఆనందం వ్యక్తంచేశారు. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఈ విజయం ప్రజల విజయమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయినప్పటికీ.. తమ గెలుపు కోసం కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యావాదాలు అంటూ రాహుల్ గాంధీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఒకవిధంగా ఇది కష్టకాలంలో లభించిన ఘన విజయంగా ఈ ఎన్నికల ఫలితాలను అభివర్ణించారు. అలాగే తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో గెలిచిన పార్టీలకు ఆయన అభినందనలు తెలియజేశారు. 

విజయం అందుకున్న చత్తీస్‌ఘడ్, రాజస్థాన్ సహా మధ్యప్రదేశ్‌లలో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకుంటామని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మరోసారి హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయం రానున్న 2019 లోక్ సభ ఎన్నికలకు పునాది అవుతుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. నరేంద్ర మోదీ సర్కార్ అన్ని రంగాల్లోనూ విఫలమైందని, తాము అభివృద్ధే లక్ష్యంగా పనిచేసి ప్రజల మన్ననలు పొందుతామని రాహుల్ గాంధీ ఆశాభావం వ్యక్తంచేశారు. 

Trending News