దద్దరిల్లనున్న పార్లమెంట్; నేటి నుంచి మలిదశ బడ్జెట్ సమావేశాలు

నేటి నుంచి పార్లమెంట్ మలిదశ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

Last Updated : Mar 5, 2018, 05:41 PM IST
దద్దరిల్లనున్న పార్లమెంట్; నేటి నుంచి మలిదశ బడ్జెట్ సమావేశాలు

న్యూఢిల్లీ: నేటి నుంచి పార్లమెంట్ మలిదశ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణం, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా నినాదాలతో పార్లమెంట్‌ సమావేశాలు హోరెత్తనున్నాయి. నేటి నుంచి మొదలుకానున్న ఈ సమావేశాల కోసం అధికార పార్టీని ఇరుకున పెట్టేవిధంగా ప్రతిపక్ష పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. అధికార పక్షం కూడా ధీటుగా బదులిచ్చేందుకు రెడీ అయ్యింది.

ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన తెలుగుదేశం, వైకాపా పార్టీలు సైతం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో తమ ఆందోళన కొనసాగించనున్నాయి. వీరికి తోడుగా ఈసారి ఏపీకి ప్రత్యేక హోదా కోసం తెరాస కూడా జతకట్టనుంది. అలానే రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకోవడానికి ఉభయసభల్లో తెరాస పోరాడాలని నిర్ణయించింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు నేటి నుంచి పార్లమెంటు ఉభయ సభల్లో తమ గళాన్ని పెంచి ఆందోళనను తీవ్రతరం చేయనున్నారు.

ఇదిలా ఉండగా.. దేశాన్నే కుదిపేసిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణంపై కూడా ఉభయసభలు దద్దరిల్లనున్నాయి. రూ.12,700 కోట్ల మేర ఎగనామం పెట్టి, విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ ఉదంతంపైనా ప్రతిపక్షాలు గళమెత్తనున్నారు. 'చోటా మోదీ' అంటూ నీరవ్‌ మోదీ పరారీకి కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా సహకరించిందని ప్రతిపక్షాలు ఇప్పటికే గగ్గోలు పెడుతున్నాయి. ఈ ఉదంతంపై బీజేపీని ఇరకాటంలో పడేసేందుకు ప్రతిపక్షాలు అస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. అయితే ప్రతిపక్షాల వ్యూహాలను తిప్పికొట్టే ప్రతివ్యూహాలతో బీజేపీ పార్టీ కూడా సిద్దమయినట్లు తెలుస్తోంది. 'ఫ్యూజిటివ్‌ ఎకనమిక్‌ అఫెండర్స్‌ బిల్' గురించి చెబుతూ, కార్తీ చిదంబరం వ్యవహారంపైన ప్రతిపక్ష పార్టీని ఇరకాటంలో పడేస్తూ.. ఎదురుదాడి చేయాలని బీజేపీ నాయకులు ప్రతివ్యూహాలు రచిస్తున్నారు.

ఈ సమావేశాల్లోనే నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌కి రాజ్యాంగ బద్ధత కల్పించే బిల్లు, త్రిపుల్‌ తలాఖ్‌ బిల్లులను ఆమోదించేలా అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. అదీగాక, ఈ నెలలో జరిగే రాజ్యసభ ఎన్నికల ద్వారా ఎగువ సభలో బీజేపీ బలం మరింత పెరుగుతోంది. దీంతో  రాజ్యసభలో బలంలేక నిలిచిపోయిన బిల్లులకు వరుసగా ఆమోద ముద్ర వేయించే అవకాశం కూడా ఉంది.

Trending News