మీరే ఆర్థిక శాఖ మంత్రి అయితే, మీరు రూపొందించే బడ్జెట్ ఎలా వుంటుంది ?

సామాన్యుడి అభిప్రాయాల వేదిక: నేనే ఆర్థిక శాఖ మంత్రిని అయితే, నేను రూపొందించే బడ్జెట్ ఇలా వుంటుంది

Last Updated : Feb 1, 2018, 03:58 PM IST
మీరే ఆర్థిక శాఖ మంత్రి అయితే, మీరు రూపొందించే బడ్జెట్ ఎలా వుంటుంది ?

సాధారణంగా కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో వున్నా.. ఎవ్వరు బడ్జెట్ ప్రవేశపెట్టినా.. ఆ బడ్జెట్ అన్నివర్గాలని సంతృప్తిపర్చే విధంగా లేదనే విమర్శలు రావడం తరచుగా మనం చూసేదే. ఆర్థిక నిపుణుల నుంచి సామాన్యుల వరకు, విషయం వున్న మేధావుల నుంచి మేధావులం అని చెప్పుకునే ప్రముఖుల వరకు, వ్యాపారవేత్తల నుంచి చిరు వ్యాపారుల వరకు, అన్నింటికిమించి ప్రతిపక్షంలో వున్న రాజకీయ నాయకుల వరకు ఎవ్వరికి వుండే ప్రాధాన్యతలు వారికి వుంటాయి. ఎవరి అభిప్రాయాలు వారు వ్యక్తంచేస్తారు. అందులో ఏ మాత్రం తప్పు లేదు. 

తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అమోఘంగా వుందని ప్రభుత్వంలోని పెద్దలు, ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు చెప్పుకోవడం ఎంత మామూలో.. బడ్జెట్‌లో పలానా రంగానికి ప్రాధాన్యత లోపించిందని, ఈసారి బడ్జెట్ అస్సలు ఆశాజనకంగా లేదని ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావడం కూడా అంతే మామూలు. ఎందుకంటే ఎవరికి వుండే అభిప్రాయాలు వారికి వుంటాయని ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 

బడ్జెట్ ఇలా వుంటే బాగుంటుంది అని కానీ లేదా దేశాభివృద్ధి కోరుకునే బడ్జెట్ ఇలా వుంటే బాగుంటుందని కానీ మీకూ కొన్ని అభిప్రాయాలు వుండే వుంటాయి కదా.. "నేనే ఆర్థిక శాఖ మంత్రిని అయితే, నేను రూపొందించే బడ్జెట్ ఇలా వుంటుంది" అని మీకూ కొన్ని అభిప్రాయాలు వుండి వుంటాయి కదా! అంతేకాకుండా ఈ బడ్జెట్ నిజంగానే సామాన్యుడిని దృష్టిలో పెట్టుకుని, దేశాభివృద్ధి లక్ష్యంగానే రూపుదిద్దుకుంది అని మీకూ అనిపించే వుంటుంది కదా!! 

అయితే, సరిగ్గా మీ లాంటి వారికోసమే ఇదిగో ఈ వేదిక. ఇక్కడ ఈ ఆర్టికల్ కింద కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. " ఏయే రంగానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి ? ఏ రంగానికి తరతరాలుగా అన్యాయం జరుగుతోంది ? ఏ రంగానికి ఎక్కువ కేటాయింపులు జరిపితే దేశం ఆర్థికంగా మరింత ముందుకు దూసుకెళ్తుంది" ? లేదంటే " మీకు ఈ బడ్జెట్ ఎందుకు అంత ఆశాజనకంగా కనిపించింది" లాంటి అంశాలపై మీకు తోచిన అభిప్రాయాలను మీరు నిస్సందేహంగా వెల్లడించండి. మీ అభిప్రాయానికి దృశ్య రూపం ఇవ్వగలిగే ప్రయత్నం చేస్తే మరింత మంచిది. విలువైన మీ అభిప్రాయాలని ఈ న్యూస్ వెబ్‌సైట్‌లో ప్రచురించడం జరుగుతుంది. మీ గొంతుకకు, అభిప్రాయానికి మరో వేదిక కల్పించాలనే తాపత్రయమే మా ఈ చిన్న ప్రయత్నం.

ఇక్కడ మనం గమనించాల్సిన అంశం మరొకటి వుంది. "కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నేతృత్వంలో ఎంతోమంది ఆర్థిక నిపుణులు ఎన్నో సమావేశాలు నిర్వహించి, ఎన్నో గణాంకాలు, సర్వేల ఫలితాలు తమ టేబుల్‌పై పెట్టుకుని ఈ బడ్జెట్‌ని రూపొందిస్తారు. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలని పరిగణనలోకి తీసుకుని బడ్జెట్ కూర్పు జరుగుతుంది. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. అటువంటప్పుడు బడ్జెట్‌ని రూపొందించే నిపుణులకన్నా.. ఆ బడ్జెట్‌ని విమర్శించే ఓ సామాన్యునికి ఎక్కువ తెలుసా" అని ప్రశ్నించే వాళ్లూ వుండకపోరు. అయితే, వాళ్ల వాదనలో కొంతమేర నిజం వున్నప్పటికీ.. అదే పూర్తి నిజం అని సామాన్యులు తమకి తాము పరిమితులు విధించుకోవాల్సిన అవసరం లేదు!! 

అదెలా అంటారా ? అయితే, అందుకూ ఇక్కడ ఓ సమాధానం తయారుగా వుంది. ఎందుకంటే ఆ ఆర్థిక శాఖ మంత్రి హోదాలో కూర్చున్న ప్రజాప్రతినిధి ఎవరైనా, ఏ పార్టీ వారైనా, వారికి ఓటేసి పంపించింది మాత్రం ఈ సామాన్యుడే అనే విషయం మర్చిపోవద్దు!! అంతేకాదు.. ప్రజాసేవలో ప్రభుత్వానికి తోడ్పాటుని అందించే బ్యూరోక్రాట్స్‌కి జీతభత్యాలు చెల్లించే ఖజానా కూడా ఈ సామాన్యుడు చెల్లించే పన్నులోంచి వచ్చిందే. 

అందుకే ప్రజలకి మేలు జరిగినప్పుడు ప్రభుత్వాన్ని అభినందించడం, మేలు జరగలేదనుకున్నప్పుడు నిలదీయడం ప్రజల హక్కు. తమ అభిప్రాయాన్ని చెప్పుకునే స్వేచ్ఛ మనకు రాజ్యాంగమే కల్పించింది కదా!! అందుకే దేశాభివృద్ధి విషయంలో ఎవరి అభిప్రాయాలు వాళ్లు చెప్పడంలో తప్పు లేదనే ఉద్దేశమే ఈ చిరు ప్రయత్నం. అంతకు మించి ఇందులో ఇంకా ఏ దురుద్దేశం లేదు. మరి ఇంకా ఎందుకు ఆలస్యం... గో ఎహెడ్!!

Trending News