మేము ఎమ్మెల్యే మనుషులం.. మమ్మల్ని మీరేం పీకలేరు: అల్వార్ కేసులో నిందితుల బెదిరింపు

అక్రమంగా గోవులను తరలిస్తున్నారనే నెపంతో రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా రాంఘర్‌లో కొందరు వ్యక్తులు దాడి చేయడంతో రక్బర్ ఖాన్ అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే.

Last Updated : Jul 23, 2018, 07:42 PM IST
మేము ఎమ్మెల్యే మనుషులం.. మమ్మల్ని మీరేం పీకలేరు: అల్వార్ కేసులో నిందితుల బెదిరింపు

అక్రమంగా గోవులను తరలిస్తున్నారనే నెపంతో రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా రాంఘర్‌లో కొందరు వ్యక్తులు దాడి చేయడంతో రక్బర్ ఖాన్ అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే పోలీసుల నిర్లక్ష్యమే అతడి మృతికి కారణమని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాజాగా ఈ కేసుకి సంబంధించి రక్బర్ ఖాన్ సోదరుడు అస్లామ్ ఖాన్ తన వివరణ ఇచ్చారు. దాడి జరుగుతున్నప్పుడు దుండగులు పదే పదే అన్న మాటలు తాను విన్నానని ఆయన చెప్పారు.

"మేము ఎమ్మెల్యే మనుషులం. మమ్మల్ని మీరు ఏమీ చేయలేరు" అని వారు బెదిరించినట్లు అస్లామ్ తెలిపారు. పాల వ్యాపారం చేయడం కోసం గోవులను కొని హర్యానాలోని తమ పల్లెకి తరలిస్తున్న సమయంలో ఈ దాడి ఘటన జరిగింది. గోవులను వధించడానికి తీసుకెళ్తున్నారన్న అనుమానంతో వారిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడి గురించి వినగానే పోలీసులు బాధితుడిని నేరుగా స్టేషనుకి తరలించకుండా చాలా ఆలస్యం చేశారని.. పైగా తనను కొట్టారని కూడా ఓ జాతీయ మీడియా ఛానల్ తన కథనంలో పేర్కొంది. 

ఈ కేసులో ఇప్పటికే రిపోర్టు అందించమని కేంద్ర హోంశాఖ రాజస్థాన్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇదే ఘటనకు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే అహుజా మాట్లాడుతూ, బాధితుడిని పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లకుండా.. పోలీస్ స్టేషన్‌కు తరలించి చావబాదారని.. అతడి మృతికి కారకులయ్యారని ఆరోపించారు. ఈ ఘటనపై రాజస్థాన్ సీఎం వసుంధరా రాజే కూడా సీరియస్ అయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి సమగ్ర దర్యాప్తు జరుగుతున్నట్లు పోలీసులు అధికారులు తెలిపారు.

Trending News