ఢిల్లీకి వైసీపీ నేతలు పయనం.. రాష్ట్రపతికి వినతి పత్రం సమర్పించనున్న ఎంపీలు

వైసీపీ పార్టీ ఎంపీలు ఈ రోజు మేకపాటి రాజమోహన్ రెడ్డి నేతృత్వంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు

Last Updated : Oct 28, 2018, 10:55 AM IST
ఢిల్లీకి వైసీపీ నేతలు పయనం.. రాష్ట్రపతికి వినతి పత్రం సమర్పించనున్న ఎంపీలు

వైసీపీ పార్టీ ఎంపీలు ఈ రోజు మేకపాటి రాజమోహన్ రెడ్డి నేతృత్వంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఈ క్రమంలో వారు భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్‌తో పాటు కేంద్ర హోంమంత్రి రాజనాథ్ సింగ్‌ని కలిసి మాట్లాడనున్నారు.  వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మూడు రోజుల క్రితం విశాఖపట్నం ఎయిర్ పోర్టులో కత్తితో దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి సమగ్ర విచారణ చేయించాలని కోరుతూ వైసీపీ నేతలు రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించనున్నారని తెలుస్తోంది.

కాగా.. ఇప్పటికే ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని.. ఆ సంఘటన జరిగిన రోజే కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. జగన్ పై దాడి జరిగాక ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. తెలుగుదేశం, వైసీపీ పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. సానుభూతి కోసం వైసీపీ నేతలే పథకం ప్రకారం.. తమ నేతపై దాడి చేయించి.. ఇప్పుడు బుకాయిస్తున్నారని పలువురు టీడీపీ నేతలు బహిరంగంగానే ప్రకటించారు. 

ఇదే క్రమంలో టీడీపీ నేత, మంత్రి పరిటాల సునీత కూడా వైసీపీ పార్టీ నేతలపై తీవ్రంగా మండిపడ్డారు. జగన్ పై జరిగిన దాడికి, చంద్రబాబుకి సంబంధం లేదన్నారు. జగన్ పై చిన్నదాడి జరిగితేనే పోలీసుల నిఘా వ్యవస్థ విఫలమైందని మాట్లాడుతున్న వైసీపీ నేతలకు పరిటాల రవి హత్య జరిగిప్పుడు ఈ వైఫల్యం కనిపించలేదా..? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న విమానాశ్రయంలో దాడి జరిగితే.. దానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమేమిటి? అని కూడా ఆమె ప్రశ్నించారు. 

Trending News