కుటుంబాన్ని ఒప్పించి.. ప్రేమను గెలుచుకోవాలంటే..?

మనం జీవితంలో తీసుకొనే నిర్ణయాల్లో కచ్చితంగా తల్లిదండ్రుల  పాత్ర ఉండనే ఉంటుంది. మన జీవన గమనంపై వారి ప్రభావం కూడా ఎంతోకొంత ఉంటుంది. ఎలాంటి విషయమైనా వారితో పంచుకోవడానికి మనం భయపడం.

Updated: May 25, 2018, 04:32 PM IST
కుటుంబాన్ని ఒప్పించి.. ప్రేమను గెలుచుకోవాలంటే..?

మనం జీవితంలో తీసుకొనే నిర్ణయాల్లో కచ్చితంగా తల్లిదండ్రుల  పాత్ర ఉండనే ఉంటుంది. మన జీవన గమనంపై వారి ప్రభావం కూడా ఎంతోకొంత ఉంటుంది. ఎలాంటి విషయమైనా వారితో పంచుకోవడానికి మనం భయపడం. అయినా సరే ప్రేమ విషయం వచ్చేసరికి.. ప్రేమించిన వ్యక్తి గురించి చెప్పాల్సిన తరుణం వచ్చేసరికి.. ఏదో తెలియని దిగులు.

తల్లిదండ్రులు తమ ప్రేమను ఒప్పుకోరేమో అనే సంశయమే పిల్లలకు వచ్చే సహజమైన సందేహం. వీటితో పాటు తమ ప్రేమ విషయం ఇంట్లో తెలిస్తే.. పర్యవసానాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన.. ఇలాంటి అంశాలే తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య ఒక వారధిగా ఉండాల్సిన బంధాన్ని బీటలు వారేలా చేస్తున్నాయి. అయినా సరే మీ ప్రేమబంధం గట్టిదైతే మీరూ మీ తల్లిదండ్రులను ఒప్పించగలరు. అందుకు ఏం చేయాలో తెలుసుకోవాలంటే ఈ వ్యాసం చదివేయండి మరి..

వారి కోణంలో ఆలోచించాలి..!
ఎవరి జీవితంలోనైనా ప్రేమ అనేది తియ్యని మధురానుభూతి. ప్రేమించిన వ్యక్తితో మీ జీవితాన్ని పంచుకోవాలంటే ముందుగా.. మిమ్మల్ని ఎంతగానో ప్రేమించే వ్యక్తులైన మీ తల్లిదండ్రుల అనుమతి కూడా తీసుకోవడం ముఖ్యమే కదా. అందుకే ముందు మీరు వారి కోణంలో కూడా ఆలోచించడానికి ప్రయత్నించాలి. మీ ప్రేమ వల్ల వారికి కలిగే ఇబ్బందులేవైనా ఉన్నాయా? లేవా అన్న విషయాన్ని కూడా ఆలోచించాలి. చాలా కుటుంబాల్లో కులం, మతం, అంతస్తులు అనేవి ఇలాంటి అంశాల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి.

అందుకే కుటుంబీకులు ప్రేమ వివాహాలంటే ఒప్పుకోకపోవచ్చు. కానీ మీరు ప్రేమ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు కాబట్టి.. ఆ విషయాన్ని మీరే మీ తల్లిదండ్రులకు ఎలాగైనా చెప్పే ధైర్యం చేయాలి. వారి సానుకూలతను పొందే ప్రయత్నం చేయాలి. మీ కుటుంబానికి బాగా కావాల్సిన వ్యక్తి చేత కూడా మీ తల్లిదండ్రులకు ఈ విషయాన్ని అర్థమయ్యేలా చెప్పించడానికి ప్రయత్నించాలి.

మీరు ప్రేమించిన వ్యక్తిని పరిచయం చేయండి
మీ కుటుంబం మీరు ప్రేమించిన వ్యక్తితో మీరు జీవితం పంచుకోవడానికి అనుమతి ఇవ్వాలంటే.. ముందు మీరు ప్రేమించిన వ్యక్తి గురించి వారు కూడా పూర్తిగా తెలుసుకొనే అవకాశం ఇవ్వండి. ఆ వ్యక్తి మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశారో మీ తల్లిదండ్రులకు తెలపండి. ఆ తర్వాత మీరు ప్రేమించిన వ్యక్తిని వారికి దగ్గర చేయడానికి ప్రయత్నించండి. మీ కుటుంబ సభ్యుల ఆలోచనలను మీరు ప్రేమించే వ్యక్తితో పంచుకొనే అవకాశం ఇవ్వండి. అలాగే తన ఆలోచనలను మీ కుటుంబ సభ్యులతో పంచుకొనే అవకాశం కూడా ఇవ్వాలి.

సందేహాలకు ఓపికతో సమాధానాలివ్వండి
మీరు ప్రేమించిన వ్యక్తి గురించి మీ తల్లిదండ్రులకు ఎన్నో సందేహాలు ఉండవచ్చు. వాటన్నింటికీ జవాబు ఇవ్వాల్సిన బాధ్యత కచ్చితంగా మీ పైనే ఉంటుందనే విషయాన్ని మీరు గ్రహించాలి. ఈ క్రమంలో కొన్ని సందర్భాల్లో మీ కుటుంబీకులు అడిగే ప్రశ్నలు మీకు కోపం తెప్పించవచ్చు.. మరికొన్ని అసహనానికి గురి చేయవచ్చు. అయినప్పటికీ మీరు శాంతంగానే, ఓపికగానే వాటికి సమాధానాలు ఇవ్వడం నేర్చుకోవాలి. అన్నింటికన్నా ముఖ్యంగా మీ ప్రేమ విషయంలో మీ కుటుంబీకులకు ఉన్న అపోహలను తొలిగించే ప్రయత్నం చేయాలి. 

తగిన సమయం ఇవ్వండి
మీ ప్రేమ విషయంలో మీ కుటుంబ సభ్యులకు ఒక అవగాహన అనేది రావడానికి మీరు వారికి కావాల్సినంత సమయం ఇవ్వండి. ఈ సమయంలో మీకు వీలు చిక్కినప్పుడల్లా వారితో మీ మనసులోని మాటలు చెప్పడానికి ప్రయత్నించండి. మీకు మీ కుటుంబం పట్ల ఎంత బాధ్యత ఉందో.. ప్రేమించిన వ్యక్తి పట్ల కూడా అంతే బాధ్యత ఉందని వారికి అర్థమయ్యేలా తెలపండి. 

(ముఖ్యంగా ప్రేమికులు సాధ్యమైనంత వరకు ఇరు కుటుంబాల మద్దతుతోనే వివాహాలు చేసుకోవడం శ్రేయస్కరం. కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రేమ వివాహాలనేవి పరిస్థితుల దృష్ట్యా ఒకరి అంగీకారం లేకుండా కూడా జరగవచ్చు. కాకపోతే శక్తివంచన లేకుండా కుటుంబ సభ్యులు అందరి ఆమోదంతోనే వివాహాం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే సమస్యలు ఒక కొలిక్కి వస్తాయన్న విషయాన్ని మాత్రం గమనించాలి) 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close