'పద్మావతి' సినిమా పై కర్ణి సేన దేశవ్యాప్త ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే.! కర్ణి సేన అంతలా మండిపడడానికి కారణం సంజయ్ లీలీ భన్సాలీ సినిమాలో రాణి పద్మిని, ముస్లిం రాజు అల్లావుద్దీన్ ఖిల్జీల మధ్య శృంగార సన్నివేశాలను చిత్రీకరించడమేనని వారు భావించడం. భన్సాలీ చరిత్రలోని వాస్తవాలను వక్రీకరించి అభ్యంతరకర సన్నివేశాలు చూపించారనే భావనే కర్ణిసేనకు మింగుడుపడడం లేదు. అసలు వారిద్దరూ ఒకరినొకరు ముఖంలో ముఖం పెట్టి చూసుకోలేదనేది కూడా కర్ణి సేన వాదనే. ఈ క్రమంలో సినిమా విషయాలు పక్కన పెడితే.. అసలు రాణి పద్మిని ఎవరు? ఆమెను ఖిల్జీ నిజంగా కలిశాడా? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం..!
చరిత్రలోకి ఒకసారి వెళితే...
* క్రీ.శ. 1540లో ' పద్మావత్' పేరుతో మాలిక్ మహ్మద్ జయాసి రాసిన ఒక ఇతిహాస పద్యంలో మొదటిసారి రాణి పద్మిని అనే పేరు వాడారు. అప్పుడే ఈ పదం వాడుకలోకి వచ్చింది.
* మేవార్ రాజు రాణా రతన్ సింగ్ కాలంలో పద్మిని (రెండవ భార్య-స్వయంవరంలో గెలిచాడు) రాణిగా ఉండేదని నమ్ముతారు. రాణా రతన్ 'రాఘవ్ చేతన్' అనే ఒక తాంత్రికుడిని క్షుద్రవిద్యలు నేర్పిస్తూ, చేతబడి అభ్యసిస్తున్న కారణంగా రాజ్యం నుండి బహిష్కరిస్తాడు. దాంతో అతనిపై పగ పెంచుకున్న ' రాఘవ్' ఢిల్లీ వెళ్లి ఖిల్జీ వద్ద ఆశ్రయాన్ని సంపాదిస్తాడు. అప్పుడు ఢిల్లీ చక్రవర్తిగా అల్లావుద్దీన్ ఖిల్జీ ఉండేవాడు.
* ఖిల్జీకి 'రాఘవ్' దగ్గరయ్యి, రాణి పద్మిని అందాల గురించి వర్ణిస్తాడు. ఆమె అందాలను చూడాలని ఖిల్జీ.. రాణా రతన్ సింగ్‌కు వర్తమానం పంపుతాడు. కాదంటే.. ఎక్కడ యుద్ధానికి దిగుతాడో లేదో అని రాణా అంగీకరిస్తాడు.
* ఖిల్జీని చిత్తోర్‌గఢ్ కోటకి ఆహ్వానించి ఒక గదిలో రాణా రతన్ సింగ్.. రాణి పద్మిని అందాలను స్వల్పంగా కనపడేటట్లు అక్కడే అమర్చిన అద్దంలో చూపిస్తాడు. ఎందుచేతనంటే రాణి పద్మిని ఖిల్జీతో ముఖాముఖీ కలిసి మాట్లాడడానికి ఇష్టపడదు.
* పద్మావతి అందానికి దాసోహమైన ఖిల్జీ.. ఆమెను దక్కించుకోవాలన్న ఆశతో క్రీ.శ.1303లో చిత్తోర్ గఢ్ కోటపై దండయాత్రకు వస్తాడు.
* రతన్ సింగ్‌ను బందీగా పట్టుకుపోయిన అల్లావుద్దీన్.. తనతో ఢిల్లీకి వస్తే.. నీ రాజును వదిలిపెడతా అంటాడు. అందుకు పద్మిని ఒప్పుకోదు.
* రాణి పద్మిని తన భర్తను విడిపించడానికి 700 సైనిక దళాలను పంపుతుంది. వారు రాజును విడిపించి తీసుకొస్తుండగా ఖిల్జీ ఆ సైనికులను, రాజును వెంబడిస్తూ వస్తాడు.
* ఆతరువాత చిత్తోర్ గఢ్ కోట వద్ద భీకర యుద్ధం జరుగుతుంది. రాజు రాణా ప్రాణాలు వదలుతాడు. ఖిల్జీ చేతికి చిక్కడం ఇష్టంలేని రాణి పద్మిని ఆత్మాహుతికి పాల్పడి ప్రాణాలు వదులుతుంది. అయితే రాణి పద్మిని జీవించినట్టు ఎలాంటి ఆధారాలు లేవని కొందరి వాదన.
* రాణి పద్మిని జీవిత కథ చుట్టూ అనేక కథలు ఉన్నాయి. అయితే రాజ్‌పుత్ మేవార్ వంశీయులు "రాణి పద్మావతి" రహస్యాలను దాచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని కూడా అంటారు. అలాగే పద్మావతి జీవితం ఒక కవి నుండి పుట్టిన ఊహేనని కొందరు వాదిస్తున్నారు.
ఈ కథ, కథనాలు ఎలా ఉన్నా.. రాణి పద్మిని జీవితంపై ఇప్పటికీ అనేక పరిశోధనలు, విశ్లేషణలు జరుగుతూనే ఉన్నాయ్..!