పట్టు కోల్పోయిన భారత్.. సిరీస్ ఇంగ్లండ్ వశం

పట్టు కోల్పోయిన భారత్.. సిరీస్ ఇంగ్లండ్ వశం

Updated: Sep 12, 2018, 12:00 PM IST
పట్టు కోల్పోయిన భారత్.. సిరీస్ ఇంగ్లండ్ వశం

లండన్‌లోని ఓవల్‌లో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన చివరి టెస్టు (ఐదో టెస్ట్) మ్యాచ్‌లో టీమిండియా 118 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కాగా ఈ విజయంతో 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ జట్టు 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇంగ్లండ్ ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 332 పరుగులకు ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్‌ను 423/8 పరుగులకు డిక్లేర్డ్ చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 292 పరుగులకు ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో 345 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో ఐదో టెస్ట్ మ్యాచ్‌లో 118 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది.

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో జాస్ బట్లర్ 89, అలిస్టర్ కుక్ 71, మొయిన్ అలీ 50, బ్రాడ్ 38 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో అలిస్టర్ కుక్ 147, జాయ్ రూట్ 125, బెన్ స్టోక్స్ 37 పరుగులు చేశారు.

భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో జడేజా 86, విహారి 56, విరాట్ కోహ్లీ 49, లోకేష్ రాహుల్ 37, ఛటేశ్వర్ పుజారా 37 పరుగుల చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో  కేఎల్ రాహుల్ 149, రిషబ్ పంత్ 114, రహానే 37 పరుగులు చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో రాహుల్, పంత్‌‌లు ఔట్ అవడంతో టీమిండియాకు పరాజయం తప్పలేదు. కానీ పోరాటంలో ఒక దశలో గెలుపు దిశగా పయనించింది. చివరికి ఓడినా.. ప్రత్యర్థి గుండెల్లో గుబులు రేపింది. ఇంగ్లండ్ బౌలర్ ఆండర్సన్‌కు మూడు వికెట్లు దక్కాయి. దీంతో ఆండర్సన్ ప్రపంచ టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన నాలుగో ఆటగాడిగా, 564 వికెట్లు తీసిన తొలి పేసర్‌గా నిలిచాడు.

సిరీస్ ఆసాంతం రాణించిన విరాట్ కోహ్లీ, సామ్ కరన్‌లకు ఉమ్మడిగా 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' లభించింది. ఆలిస్టర్ కుక్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' దక్కింది. కాగా.. టెస్ట్ సిరీస్ విజయంతో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్‌కు ఆ జట్టు ఘనమైన వీడ్కోలు పలికినట్లయింది.

ఐదో టెస్టు సైడ్ లైన్స్

  • సిక్సర్‌తో సెంచరీ చేసిన నాలుగో భారత బ్యాట్స్‌మెన్‌ పంత్‌.
  • మ్యాచ్‌ నాలుగో ఇన్నింగ్స్‌లో శతకం చేసిన మొదటి భారత వికెట్‌ కీపర్‌ పంత్‌. ప్రపంచంలోఏడోవాడు.
  • 593: ఈ సిరీస్‌లో  అత్యధికంగా విరాట్‌ కోహ్లి సాధించిన  పరుగులు
  • ప్రపంచ టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన నాలుగో ఆటగాడు ఆండర్సన్‌. 564 వికెట్లు తీసిన తొలి పేసర్‌ కూడా.