నల్గొండ మిర్యాలగూడలో పరువు హత్య

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఈ రోజు జరిగిన పరువు హత్య సంచలనం సృష్టించింది.

Updated: Sep 15, 2018, 12:49 PM IST
నల్గొండ మిర్యాలగూడలో పరువు హత్య
Representational Image

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఈ రోజు జరిగిన పరువు హత్య సంచలనం సృష్టించింది. గర్భవతిగా ఉన్న భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లి.. మళ్లీ తిరిగి తన ఇంటికి తీసుకెళ్తున్న భర్తపై దుండగుడు దాడి చేసి విచక్షణారహితంగా కత్తులతో పొడవడంతో బాధితుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. స్థానికంగా ఈ హత్యపై పలు వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. బాధిత దంపతులు ఇద్దరూ కొన్ని నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారని.. అయితే ఆ వివాహం అమ్మాయి తరఫు కుటుంబీకులకు ఇష్టం లేదని తెలుస్తోంది. కులాలు వేరు కావడం వల్ల ఆ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని కూడా సమాచారం.

గతంలో అమ్మాయి తండ్రి పలుమార్లు తనను ఇంటికి రమ్మని కోరినా ఆమె ఒప్పుకోలేదు. తన భర్తతో కలిపి ఆహ్వానిస్తేనే వస్తానని తెలిపింది. గత కొన్నాళ్లుగా ఇరు కుటుంబాలకు మధ్య దూరం కూడా పెరిగింది. ఈ క్రమంలో ఈ హత్య జరగడం వెనుక అమ్మాయి కుటుంబీకులు ఉండవచ్చని కొందరు అంటున్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎస్పీ రంగనాథ్‌ కూడా మీడియాతో మాట్లాడుతూ.. ఇది కచ్చితంగా పరువు హత్యేనని తెలిపారు. కిరాయి హంతకుడి ద్వారా ఈ హత్యను చేయించారని తెలుస్తోందని అభిప్రాయపడ్డారు. గతంలో అమ్మాయి బంధువులు వారిని బెదిరించినట్లుగా కూడా తెలుస్తోంది. 

ప్రస్తుతం ఈ కేసులో అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె తండ్రితో పాటు బాబాయిపై కూడా కేసులు నమోదు చేశారు. వారిని త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరినీ ఏ1, ఏ2లుగా పేర్కొన్నారు. ఈ హత్యను చేయించడానికి కిరాయి హంతకుడికి రూ.10 లక్షలు ఇచ్చినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అమ్మాయి తండ్రి ప్రముఖ బిల్డర్ అని.. తనకున్న పలుకుబడితోనే ఆయన ఈ దారుణానికి ఒడిగట్టారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఎస్పీ నిందితులు పరారీ అవ్వకుండా వారి కదలికలను గమనించి.. కనిపిస్తే వెంటనే అరెస్టు చేయమని పోలీసులకు తెలియజేశారు.