ఇవాంక డిన్నర్ వీడియో వైరల్‌పై వివాదం

ఇవాంకతో కలిసి ప్రధాని మోదీ విందులో పాల్గొన్నప్పుడు కొందరు రహస్యంగా వీడియో కెమెరా ద్వారా ఆ కార్యక్రమాన్ని చిత్రీకరించి లీక్ చేశారు. 

Last Updated : Dec 1, 2017, 02:05 PM IST
ఇవాంక డిన్నర్ వీడియో వైరల్‌పై వివాదం

ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన అమెరికా సలహాదారు ఇవాంక ట్రంప్‌కు భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక విందు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విందు జరుగుతున్నప్పుడు కొందరు రహస్యంగా వీడియో కెమెరా ద్వారా ఆ కార్యక్రమాన్ని చిత్రీకరించి లీక్ చేశారు. అలా లీకైన వీడియోని అనేక స్థానిక టీవీ ఛానల్స్ ప్రసారం చేయడంతో, అవాక్కవ్వడం అధికారుల వంతైంది. అయితే వెంటనే తెలంగాణ పోలీస్ శాఖ స్పందించి, లైవ్ ఫీడ్‌‌ను సోషల్ మీడియాలో  తొలిగించి.. ఆ అంశాలకు చెందిన వార్తా ప్రసారాలను నిలిపివేయాలని.. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని తెలపడంతో ఆయా ఛానళ్లు వెంటనే లైవ్ ఫీడ్‌ను తొలిగించాయి. 

ప్రస్తుతం ఆ వీడియోని ఎవరు లీక్ చేశారన్న అంశంపై పోలీస్ శాఖ ఎంక్వయిరీ వేసింది. లైవ్ సీసీ టీవీ ఫీడ్‌నే ఎవరో లీక్ చేశారంటే.. భద్రతా దళాల వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లే అవకాశం ఉందని... ఇలాంటి సంఘటనలు మళ్లీ రిపీట్ కాకూడదని తెలంగాణ డీజీపీ తన సిబ్బందికి తెలిపినట్లు సమాచారం. అలాగే ఇదే సదస్సులో ఒక ప్రత్యేకమైన గదిలో సోఫాపై ఆసీనులై ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్ మాట్లాడుకుంటున్న వీడియోని కూడా పలు నేషనల్ మీడియా ఛానల్స్ విడుదల చేయడంతో, సెక్యూరిటీ బ్రీచ్ జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ సమస్యను వెంటనే పరిష్కరించామని తెలంగాణ పోలీస్ శాఖ ప్రకటించింది. 

Trending News