నిమజ్జనానికి తరలిన ఖైరతాబాద్ మహాగణపతి

నిమజ్జనానికి తరలిన ఖైరతాబాద్ మహాగణపతి

Last Updated : Sep 23, 2018, 05:19 PM IST
నిమజ్జనానికి తరలిన ఖైరతాబాద్ మహాగణపతి

ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనోత్సవ శోభాయాత్ర ప్రారంభమైంది. భారీ క్రేన్‌పై గణనాథుడిని ఎక్కించి ప్రత్యేక ట్రాలీపైకి చేర్చారు.. ఖైరతాబాద్‌ వినాయకుడు వెళ్లే మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్‌ నిలిపివేశారు. ఆదివారం మధ్యాహ్నంలోపే మహాగణపతి నిమజ్జనానికి ట్యాంక్‌బండ్‌ వద్ద అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆరో నంబరు క్రేన్‌ వద్ద ఖైరతాబాద్‌ వినాయకుడి నిమజ్జనం చేయనున్నారు. కాగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఖైరతాబాద్ గణనాథుని విగ్రహ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించనున్నారని తెలిసింది.  అటు వినాయక నిమజ్జనానికి గూగుల్‌ సాయం అందిస్తోంది. నిమజ్జన ఊరేగింపు, ట్రాఫిక్‌ స్థితిగతులను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తోంది. గణేష్‌ నిమజ్జనాన్ని తిలకించేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించారు.

అటు బాలాపూర్ వినాయకుడి నిమజ్జన ఊరేగింపు ప్రారంభమంది. బాలాపూర్‌ గణేష్‌ లడ్డూ వేలం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. 1994 నుంచి బాలాపూర్‌ గణేష్‌ లడ్డూ వేలంపాట నిర్వహిస్తుండగా.. అదే ఏడాది తొలిసారి లడ్డూ వేలంపాటలో 450 రూపాయలకు పలికింది. గతేడాది రూ.15.60లక్షలకు పలికింది.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గణేష్‌ ముగింపు ఉత్సవాలకు భారీగా ఏర్పాట్లు చేశామని రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. ఉత్సవాలకు కొత్త టెక్నాలజీని ఉపయోగించామన్న ఆయన..   రాష్ట్ర వ్యాప్త పీఎస్‌లలోని సీసీ కెమెరాలు డీజీపీ కార్యాలయానికి అనుసంధానం చేశామన్నారు.సోషల్‌ మీడియాలో ఎవరైనా తప్పుడు పోస్టులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

హైదరాబాద్ నగరంలో గణేష్‌ నిమజ్జనానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని సీపీ అంజనీకుమార్‌ అన్నారు.నగరంలో 19వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటుతో పాటు 2లక్షలకు పైగా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు.ఈసారి నగరంలో 15వేల విగ్రహాలు నిమజ్జనం కానున్నాయన్నారు.

Trending News