జార్ఖండ్ చిన్నారులు తెలంగాణకు అక్రమ రవాణా..!

జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఆరు, ఏడు, ఎనిమిది సంవత్సరాల వయసున్న 100 మంది చిన్నారులను తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు తరలిస్తున్న ఓ ముఠాను ఈ రోజు బొకారో, రాంచీ స్టేషన్లలో పోలీసులు అరెస్టు చేశారు.

Last Updated : Jul 14, 2018, 06:03 PM IST
జార్ఖండ్ చిన్నారులు తెలంగాణకు అక్రమ రవాణా..!

జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఆరు, ఏడు, ఎనిమిది సంవత్సరాల వయసున్న 100 మంది చిన్నారులను తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు తరలిస్తున్న ఓ ముఠాను ఈ రోజు బొకారో, రాంచీ స్టేషన్లలో పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. దాదాపు 100 మంది చిన్నారులను బలవంతంగా ధన్ బాద్-అల్లపూజ ఎక్స్‌ప్రెస్‌‌లో ఎక్కిస్తున్న నలుగురు అనుమానాస్పద వ్యక్తుల గురించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సమాచారం అందగా.. వారు పోలీసులకు సమాచారం అందించారు. రైలు మధ్యాహ్నం బొకారో చేరగానే.. అక్కడ మాటు వేసిన పోలీసులు.. ట్రైన్‌లోకి ఎక్కి 84 మంది బాలలను రక్షించారు.

వారిని తరలిస్తున్న వ్యక్తుల నుండి సరైన సమాధానం అందకపోవడంతో వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అలాగే అదే రైలులో ప్రయాణిస్తున్న మరో 21 మంది బాలలను రాంచీ చేరాక పోలీసులు కాపాడారు. ఈ మధ్యకాలంలో చిన్నారులను అక్రమంగా తరలించే ముఠాలు ఎక్కువవుతున్న క్రమంలో.. రైల్వేస్టేషన్లపై భద్రతా వ్యవస్థ ప్రత్యేక నిఘా పెట్టింది. చైల్డ్ లైన్ సేవల గురించి కూడా పౌరులకు వివిధ ప్రకటనల ద్వారా తెలియజేయడం జరుగుతోంది. 

తాజా కేసులో దొరికిన బాలలను అందరినీ కూడా ప్రస్తుతానికి జంతారా ప్రాంతంలో ఉన్న శిశు సదన్‌లో చేర్చారు. వారి తల్లిదండ్రుల వివరాలు తెలిశాక.. వారికి ఇళ్లకు పంపించదలిచామని బొకారో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్ పర్సన్ డాక్టర్ వినయ్ మీడియాకి తెలిపారు. ఈ కేసులో పట్టుబడిన నలుగురు ఆగంతకులపై కూడా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని ఆయన తెలిపారు.  వారిలో ముగ్గురు తాము మదర్సా టీచర్లమని చెప్పగా.. మరో వ్యక్తి వంటవాడిగా పరిచయం చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

Trending News