కేసీఆర్ నోట.. బంగ్లాదేశ్ సామాజికవేత్త కథ

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) గిరిజన సంఘాల ప్రతినిధులతో మాట్లాడారు. తండాలను గ్రామ పంచాయితీలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చట్టం చేసిన  క్రమంలో వివిధ తెగలకు చెందిన గిరిజనులను, గిరిజన నాయకులను సమావేశపరిచి ప్రగతిభవన్‌లో కేసీఆర్ వారితో మాట్లాడారు.

Last Updated : Mar 31, 2018, 06:38 PM IST
కేసీఆర్ నోట.. బంగ్లాదేశ్ సామాజికవేత్త కథ

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) గిరిజన సంఘాల ప్రతినిధులతో మాట్లాడారు. తండాలను గ్రామ పంచాయితీలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చట్టం చేసిన  క్రమంలో వివిధ తెగలకు చెందిన గిరిజనులను, గిరిజన నాయకులను సమావేశపరిచి ప్రగతిభవన్‌లో కేసీఆర్ వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

తెలంగాణ ఉద్యమంలో భాగంగా గిరిజనులు ఇచ్చిన తోడ్పాటు మరువలేనిదని తెలిపారు. ఉద్యమంలో భాగంగా తాను గిరిజన తండాలకు వచ్చినప్పుడు, తండాలను గ్రామ పంచాయితీలుగా చేయాలని డిమాండ్ వచ్చిందని.. ఆ కోరిక ఇప్పుడు గిరిజనులకు నెరవేరిందని కేసీఆర్ అన్నారు. గిరిజనులలో కూడా వివిధ తెగలున్నాయని.. లంబాడీలు, ఆదివాసీలు, గోండులు, కోయలు, చెంచులు.. ఇలా ఒక్కొక్కరిలో ఒక్కో జీవనశైలి, భాష, ఆహారం, ఆహార్యం ఉన్నాయని.. అందుకే ప్రత్యేకంగా తండాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అని తెలిపారు. 

మరో అయిదేళ్ళలో గిరిజనులకు సబ్ ప్లాన్ కింద ఇచ్చే సొమ్ము రూ.50 వేల కోట్లకు పైగానే ఉంటుందని కేసీఆర్ తెలిపారు. ఇప్పటికే గిరిజన బిడ్డల కోసం రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టామని ఆయన అన్నారు. అలాగే గిరిజనులు కూడా పొదుపు చేయడం నేర్చుకోవాలని తెలిపారు. అందుకు ప్రభుత్వం అండ ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఆయన బంగ్లాదేశ్‌కు చెందిన సామాజికవేత్త మహ్మద్ యూనస్ గురించి ప్రస్తావించారు. 

యూనివర్సిటీ ప్రొఫెసరైన యూనస్ తన ఊరిలోని స్వయం ఉపాధి పనులు చేసుకొనే మహిళలు అధిక మొత్తానికి దళారుల వద్ద నుండి డబ్బు అప్పు తీసుకోవడం చూసేవాడని.. అందుకే వారికి ఏదైనా చేయాలని భావించేవాడని అన్నారు. యూనిస్ దళారుల కంటే తక్కువ డబ్బుకే మహిళలకు డబ్బు వడ్డీకి ఇచ్చి వారు వ్యాపారం చేసేలా పథకం రచించారని.. ఆ తర్వాత ఓ రోజు తనింటికి వారిని భోజనానికి పిలిచి.. తాను సంపాదించిన వడ్డీనంతా వారికి తిరిగి ఇచ్చేశారని కేసీఆర్ అన్నారు. 

కేవలం ప్రజలకు పొదుపు మంత్రం నేర్పడానికి ఆయన ఆ పని చేశాడని.. ఆ డబ్బుతో వారిని వ్యాపారం చేసుకోమన్నాడని.. తాను తయారుచేసినట్టే ఒక్కొక్కరూ ఒక్కో గ్రూపు తయారుచేయాలని తెలిపాడన్నారు. అలాంటి గ్రూపులు ఆ తర్వాత అతని ప్రాంతంలో 15,500 ఏర్పడ్డాయని కేసీఆర్ అన్నారు. తెలంగాణలోని గిరిజన తండాలలో కూడా ట్రైబల్ సబ్‌ప్లాన్ దళారుల పాలుకాకుండా నిజమైన లబ్ధిదారులకు వర్తింపజేసేలా తాము ప్రయత్నిస్తామని..ప్రజలు కూడా డబ్బులు దుబారా కాకుండా చూడాలని.. అందుకు మహిళలు గట్టిగా పట్టుబట్టాలి అని కేసీఆర్ అన్నారు. 

Trending News