టీఆర్ఎస్ సరికొత్త వ్యూహం ; సగం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు డౌటే

                           

Updated: Jul 11, 2018, 04:53 PM IST
టీఆర్ఎస్ సరికొత్త వ్యూహం ; సగం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు డౌటే

2019 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కేసీఆర్ కసరత్తు ప్రారంభించారు. ఎన్నికల్లో గట్టెక్కేందుకు ఎలాంటి వ్యూహం అనుసరిస్తే బాగుంటుందనే అంశంపై  పార్టీ సీనియర్ నేతలతో నిరంతరం సమాలోచనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజా వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టాలనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నట్లు తెలిసింది. సీనియర్ల అభిప్రాయాలతో ఏకీభవించిన కేసీఆర్ ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేయడంలో విఫలమైమన సిట్టింగ్ ఎమ్మెల్యేల జాబితాను తయారు చేసుకున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ జాబితాలో సగానికి పైగా ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకత ఉందని తేలినట్లు సమాచారం. 

టీడీపీ నుంచి వచ్చిన వారి మెడపై కత్తి
2014 ఎన్నికల్లో టిడిపి నుంచి విజయం సాధించి ఆపై పార్టీ ఫిరాయించి టీఆర్ఎస్ లో చేరిన కొందరి మెడపైనా కత్తి వేలాడుతోంది. వీరికి మరోమారు అవకాశం లభించడం కష్టమేనని సమాచారం. 

'ఆపరేషన్ కాంగ్రెస్'
2019 ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ కనిపించకుండా చేయాలని భావిస్తున్న కేసీఆర్ 'ఆపరేషన్ కాంగ్రెస్'లో భాగంగా కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లను కాంగ్రెస్ నాయకులకు ఇవ్వాలని కూడా అనుకుంటున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమయ్యే కాంగ్రెస్ నేతలకు ఈ సీట్లను 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఇవ్వాలన్నది ఆయన ఉద్దేశమని కొందరు నేతలు అంటున్నారు.

నగర ఎమ్మెల్యేలకు చెక్ పెట్టే వ్యూహం 
ఇక హైదరాబాద్ నగరానికి వస్తే నగర పరిధిలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం కేసీఆర్ చాలా అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ అంచనా వేస్తున్నట్టుగా ప్రజల్లోకి వెళ్లలేకపోయారన్న నిర్ణయానికి వచ్చిన కేసీఆర్.. వీరి స్థానాల్లో మరొకరిని ఎమ్మెల్యేగా బరిలోకి నిలిపే అవకాశాలు ఉన్నాయని సరైన సమయంలో ఆయన తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలుస్తోంది.

డైలమాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు

కాగా సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో గెలవలేరని భావిస్తున్న వారి స్థానంలో మరో సమర్థవంతుడైన నేతను వెతికే పనిని తన దగ్గరి సన్నిహితులకు కేసీఆర్ అప్పగించినట్టు తెలుస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తమ పరిస్థితి ఎలా ఉందంటునే దానిపై కొందరు డైలమాలో ఉండగా..మరికొందరు పరిస్థితి బట్టి గోడ దూకాలని భావిస్తున్నట్లు సమాచారం.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close