Minister Harish Rao: కాంగ్రెస్ పాలన అంటే ఎట్లా ఉంటాదంటే.. మంత్రి హరీష్ రావు సెటైర్లు

Minister Harish Rao Speech in Achhampeta BRS meeting: తెలంగాణ గొప్పతనం నిలిపే విధంగా కేసిఆర్ సెక్రటేరియట్ కడితే.. బిజెపి నాయకుడు కూలగొడతా అన్నాడు. కాంగ్రెస్ వారు పేల్చేస్తాం అన్నాడు. కూల్చేటోడో లేక పేల్చేటోడో కావాలా.. లేదంటే తెలంగాణ నిర్మించేటోడు కావాలా అనేది జనమే నిర్ణయించుకోవాలి అని మంత్రి హరీష్ రావు సూచించారు. 

Written by - Pavan | Last Updated : May 31, 2023, 06:36 AM IST
Minister Harish Rao: కాంగ్రెస్ పాలన అంటే ఎట్లా ఉంటాదంటే.. మంత్రి హరీష్ రావు సెటైర్లు

Minister Harish Rao Speech in Achhampeta BRS meeting: అచ్చంపేట సాగునీటి పథకానికి ఆమోదం తెలిపిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల పక్షాన నిర్వహించిన ధన్యవాద సభకు ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సభను ఉద్దేశించి మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు చాలా మంచి రోజు. ఈరోజు రెండు మంచి పనులు అచ్చంపేట నియోజకవర్గంలో జరిగాయి. ఒకటి అచ్చంపేట 100 పడకల గవర్నమెంట్ ఆసుపత్రి రావాలి.. అలాగే అచ్చంపేటకు కృష్ణానది నీళ్లు రావాలి. ఈ రెండూ ఈ రోజే జరిగాయి అని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. 2300 కోట్ల రూపాయల నిధులతో ఉమామహేశ్వర ప్రాజెక్ట్, చెన్నకేశవ స్వామి ప్రాజెక్టు, ఆంజనేయ స్వామి ప్రాజెక్టు మంజూరు చేసిన మన ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞతలు చెబుతున్నా అని అన్నారు.

కృష్ణానది నీళ్లు అచ్చంపేటకు వస్తే రూపురేఖలే మారిపోతున్నాయి. దశాబ్దాల కలను నిజం చేసిన ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం. తరతరాలు అచ్చంపేట నియోజకవర్గం గుర్తుపెట్టుకునే గొప్ప కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సాధించిండు. త్వరితగతిన ఈ ప్రాజెక్టులు పూర్తికావడానికి నా సంపూర్ణ మద్దతు మీకు ఉంటుందని తెలియజేస్తున్నాను. ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, నెట్టెంపాడు, డిండి అన్ని పథకాలు పూర్తయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రూపురేఖలే మారిపోతాయి అని మంత్రి హరీశ్ రావు ఆశాభావం వ్యక్తంచేశారు. 

రేపు మనకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభం అవుతుంది. అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభమవుతాయి. గతంలో పదేళ్లు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక్క ఎకరానికి కూడా మేలు చెయ్యలేదు. "కెసిఆర్ తోనే జలదృశ్యం.. అదే విపక్షాలకు అప్పగిస్తే ఆత్మహత్యా సదృశమే అవుతుంది అని హరీష్ రావు అభిప్రాయపడ్డారు. అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న మన ముఖ్యమంత్రి కేసీఆర్.. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి విషయాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు అని గుర్తుచేశారు. నేను పోను బిడ్డ సర్కారు దావఖానకు అన్నట్టు ఉండే రోజుల నుండి నేను పోతా బిడ్డ సర్కారు దవాఖానకు అనేటట్టు చేసిండు. ఇతర రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలపై అధ్యయనం చేసి ఆ రాష్ట్రాల్లో అమలు చేసే విధంగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు అంటూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కొనియాడారు.

ఇతర రాష్ట్రాల ప్రజలు తెలంగాణలో అమలవుతున్న పథకాలు మాకు కూడా అమలు చేయాలని వారి రాష్ట్ర ప్రభుత్వాలు నిలదీస్తున్నారు. బిజెపి పని అయిపోయిందని నిన్న చేరికల కమిటీ ఛైర్మెన్ ఈటల రాజేందర్ స్వయంగా చెప్పిండు. బిజెపిలో ఎవ్వరూ చేరడం లేదు అని చేతులు ఎత్తేసిండు. ఆయన చెప్పేది వేదాంతం... చేసేది రాద్దాంతం.. కడుపులంతా ఇసం.. అని హరీష్ రావు అసహనం వ్యక్తంచేశారు. 

పాలమూరు ఎత్తిపోతల పథకాల గురించి నరేంద్ర మోడీకి కానీ లేదా రాహుల్ గాంధీకి కానీ తెలుస్తదా అని ప్రశ్నించిన మంత్రి హరీష్ రావు.. తెలంగాణ సమస్యలు తెలంగాణ ప్రజల అవసరాలు ముఖ్యమంత్రి కేసీఆర్ కి తెలిసినంతగా మరి ఎవరికి తెలవదు అని అన్నారు. 

తెలంగాణ గొప్పతనం నిలిపే విధంగా కేసిఆర్ సెక్రటేరియట్ కడితే.. బిజెపి నాయకుడు కూలగొడతా అన్నాడు. కాంగ్రెస్ వారు పేల్చేస్తాం అన్నాడు. కూల్చేటోడో లేక పేల్చేటోడో కావాలా.. లేదంటే తెలంగాణ నిర్మించేటోడు కావాలా అనేది జనమే నిర్ణయించుకోవాలి అని సూచించారు. కాంగ్రెస్ పాలన చేస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ పాలనలో ఎరువుల బస్తాల కోసం లాఠీచార్జులు పోలీస్ స్టేషన్లో లైన్ల నిలిచిన రోజులు మరిచిపోయామా అని చెబుతూ పరోక్షంగా తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు. కన్నులో వత్తులేసుకుని దొంగ రాత్రికి కరెంటు కోసం ఎదురుచూసిన రోజులు మళ్లీ రావాలా. కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు కావాలా అని సభకు హాజరైన వారిని ప్రశ్నించారు. రైతుబంధు పథకం కొనసాగాలంటే మన బిఆర్ఎస్ ప్రభుత్వం ఉండాలి. కాంగ్రెస్ పార్టీ పాలన అంటే 24 గంటల కరెంటు ఉండదు, కాంగ్రెస్ పాలన అంటే త్రాగునీరు ఉండదు, కాంగ్రెస్ పాలన అంటే 2000 రూపాయల పెన్షన్ ఉండదు, కాంగ్రెస్ పాలన అంటే రైతుబంధు ఉండదు, కాంగ్రెస్ పాలన అంటే రైతు బీమా ఉండదు. బీఆర్ఎస్ పార్టీ పేద ప్రజల పార్టీ.. పేదల కోసం ఆలోచించే నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్... "బీఆర్ఎస్ పార్టీ అంటే బిజెపికి భయం పట్టుకున్నది కాంగ్రెస్ పార్టీకి కలవరం పట్టుకుంది" అంటూ ప్రతిపక్షాలపై మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Trending News