హైదరాబాద్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీ ఓటు హక్కు గల్లంతయ్యిందా ? మీకు 18 ఏళ్లు నిండినా ఓటు హక్కు లేదా ? ఓటర్ ఐడీలో మీ వివరాలు తప్పుల తడకగా వున్నాయా ? ఓటర్ ఐడీలో చిరునామాను మార్చాలని భావిస్తున్నారా ? అయితే, ఇదిగో ఈ అవకాశం సరిగ్గా మీకోసమే. వచ్చే ఏడాదిలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈనెల 26వ తేదీ నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం. దానకిశోర్ తెలిపారు. వచ్చే జనవరి 25వ తేదీవరకు ఓటర్ల జాబితాలో కొత్తగా పేరు నమోదు, పేరు తొలగింపు, చిరునామా తదితర వివరాల మార్పు, తప్పొప్పుల సవరణలు చేయడం జరుగుతుందని ఆయన ప్రకటించారు. వచ్చే జనవరి 1వ తేదీకి 18 సంవత్సరాలు నిండినవారు కొత్తగా ఓటు హక్కు పొందేందుకు అర్హులు అవుతారని దాన కిషోర్ పేర్కొన్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది ఓటర్లు తమ ఓటు హక్కు గల్లంతయ్యిందని ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఎన్నికలు జరిగిన అనంతరం మీడియాతో మాట్లాడిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ సైతం జరిగిన పొరపాటుకు ఓటర్లకు క్షమాపణలు తెలిపారు. ఈ క్రమంలోనే ఓటర్ల జాబితా సవరణపై మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వివిధ రాజకీయపార్టీల ప్రతినిధులతో సమావేశమైన కమిషనర్.. సమవేశం అనంతరం ఆ వివరాలను విలేకరులతో పంచుకునే క్రమంలో ఈ ప్రకటన చేశారు.
ఓటర్ల జాబితాలో ఓటర్ల పేర్లు ఉన్నాయా లేక గల్లంతయ్యాయా అనే వివరాలు తెలుసుకునేందుకు మై జీహెచ్ఎంసీ యాప్, సీఈఓ, సీఈసీ వెబ్సైట్ల ద్వారా తెలుసుకోవచ్చని ఈ సందర్భంగా కమిషనర్ సూచించారు. ఈ సవరణ కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులను ఫిబ్రవరి 11లోగా పరిశీలించి, 22వ తేదీన తుది జాబితాను విడుదల చేస్తామని కమిషనర్ చెప్పారు. ఓటు హక్కు గల్లంతయిన వాళ్లు, ఓటర్ ఐడీలో తప్పుడు వివరాలు నమోదైన వారు, కొత్తగా ఓటు హక్కు దరఖాస్తు కోసం చేసుకునే వాళ్లు ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా కూడా పేరు నమోదు చేసుకోవచ్చని కమిషనర్ తెలిపారు.