ఒక రోజు ముందే కుమారస్వామిని కలిసిన తెలంగాణ సీఎం కేసీఆర్

కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి కుమారస్వామిని కలిసిన తెలంగాణ సీఎం కేసీఆర్ 

Last Updated : May 23, 2018, 12:25 AM IST
ఒక రోజు ముందే కుమారస్వామిని కలిసిన తెలంగాణ సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మంగళవారం సాయంత్రం కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి కుమారస్వామిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవం జరగనుండగా మంగళవారం సాయంత్రమే బెంగళూరులోని మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ నివాసానికి చేరుకున్న కేసీఆర్... అక్కడ దేవెగౌడ, కుమారస్వామి, రేవణ్ణతో భేటీ అయ్యారు. అనంతరం దేవేగౌడ నివాసం వెలుపల కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కుమారస్వామి సీఎం కానుండటం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించింది అని అన్నారు. కుమారస్వామికి ఆ దేవుడి ఆశీస్సులు ఉంటాయన్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, ప్రాంతీయ పార్టీల పవరేంటో భవిష్యత్‌లో చూస్తారని ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో రేపు బుధవారం తనకు కలెక్టర్లతో కాన్ఫరెన్స్ ఉన్నందునే తాను కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకాలేకపోతున్నట్లు కేసీఆర్ స్పష్టంచేశారు. 

ఇదిలావుంటే, గతంలో ఎన్నికలకు కొద్ది రోజుల ముందు బెంగళూరు వెళ్లిన కేసీఆర్.. అక్కడ జనతా దళ్ సెక్యులర్ పార్టీ అధినేత దేవేగౌడ, కుమారస్వామిలతో ప్రత్యేకంగా భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగు వాళ్లంతా జేడీఎస్‌కి ఓటేయాలని కర్ణాటకలోని తెలుగు ఓటర్లకు విజ్ఞప్తి చేసిన కేసీఆర్.. కుమారస్వామి తప్పకుండా విజయం సాధిస్తారని, మరో నెల రోజుల తర్వాత మళ్లీ తాను వచ్చి ఆయన్ని కలుస్తానని అప్పట్లోనే ప్రకటించారు. 

Trending News