ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు, తీవ్ర విమర్శలు

ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు, తీవ్ర విమర్శలు

Last Updated : Oct 24, 2019, 08:50 PM IST
ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు, తీవ్ర విమర్శలు

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై తెలంగాణ సీఎం కేసీఆర్ పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె అసలు ప్రభుత్వం దృష్టిలో సమ్మెనే కాదని అన్నారు. హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్ గెలిచిన అనంతరం సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్.. ఆర్టీసీ కార్మికుల సమ్మె, ఆర్టీసీ భవితవ్యం, ఆర్టీసీతో లాభ-నష్టాలు, కార్మికుల పని తీరు, యూనియన్ల రాజకీయాలు, వారికి ప్రతిపక్షాల మద్దతు వంటి అనేక అంశాలపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయడం ఏంటి ? అసలు ఆర్టీసీనే ముగియబోతోంది అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. కార్మికులు అనవసరమైన, అర్థంపర్థం లేని, దురహంకార వైఖరిని అవలంబిస్తున్నారని సమ్మెలో పాల్గొంటున్న వారిని ఉద్దేశించి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆర్టీసీ, ప్రభుత్వం ఉన్న ఆర్థిక పరిస్థితులను పట్టించుకోకుండా, నెలకు సగటున రూ.50,000 జీతం తీసుకుంటున్నాం కదా అనే కనీస బాధ్యత కూడా లేకుండా ఆర్టీసీ కార్మికులు ప్రవర్తించారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. 

ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు అవసరమైన నిధుల సమీకరణ కోసం విలువైన భూముల్ని అమ్మేందుకు కార్యాచరణ సిద్ధమవుతోందని.. ఇంత క్లిష్ట సమయంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకి వెళ్లి మొండి వైఖరిని అవలంభించడం తాను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించనని స్పష్టంచేశారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు సంబంధించి తనకంటే ఎక్కువ అవగాహన ఉన్న వ్యక్తి మరొకరు ఉన్నారని తాను అనుకోవడం లేదని, రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడే సంస్థ అభివృద్ధి కోసం తాను కృషి చేశానని అన్నారు. ఆర్టీసీని నష్టాల్లోంచి, అప్పుల్లోంచి బయటపడేయడానికి చేయాల్సిన అన్ని ప్రయత్నాలూ చేశానని, ఏ ఏడాదికి ఏడాది నిధులు కేటాయించడం, నిధులు మంజూరు చేయడం చేసినప్పటికీ ఇంకా ప్రభుత్వం ఏమీ చేయలేదంటే ఎలా అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.

Trending News