విద్యార్థుల చావుకి కారణమైన వారితో కోదండరామ్ ఎలా కలుస్తారు? - టీఆర్ఎస్ నేత హరీష్ రావు

తెలంగాణ జన సమితి నేత కోదండరామ్ పై టీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. 

Last Updated : Nov 12, 2018, 06:23 PM IST
విద్యార్థుల చావుకి కారణమైన వారితో కోదండరామ్ ఎలా కలుస్తారు? - టీఆర్ఎస్ నేత హరీష్ రావు

తెలంగాణ జన సమితి నేత కోదండరామ్ పై టీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్, టీడీపీలతో కోదండరామ్ పొత్తు పెట్టుకోవడం తనకు ఆశ్చర్యం కలిగిస్తోందని ఆయన అన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన వారితో ఇప్పుడు కోదండరామ్ జత కట్టడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ జన సమితి నేతగా ఉంటూ.. తనవారికి తానే పంగనామాలు పెట్టారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమనేతగా పేరుగాంచిన కోదండరామ్ ఇప్పుడు అమరావతికి, ఢిల్లీకి గులాంగిరీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ఒకప్పుడు కోదండరామ్‌కు రక్షణగా నిలిచిన పార్టీ ఏదైనా ఉంటే... అది తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రమేనని.. కానీ ఆ విషయాన్ని కోదండరామ్ మరిచిపోయారని హరీష్ రావు అన్నారు. గాంధీభవన్ ఎదుట పొర్లు దండాలు పెట్టడానికి కోదండరామ్ ప్రయత్నించడానికి కారణం.. ఓ నాలుగు సీట్లు దక్కించుకోవాలనే స్వార్థం మాత్రమేనని.. ఒకప్పుడు తనను కాంగ్రెస్ నేతలు విమర్శించిన విషయాన్ని ఆయన మర్చిపోకూడదని హరీష్ రావు హితవు పలికారు. 

ఉద్యమం సమయంలో కోదండరామ్ పై కాంగ్రెస్ కేసులు పెట్టిందని.. అటువంటి పార్టీతో కలిసి మహాకూటమిలో భాగస్వామ్యం ఎందుకు పొందారో కోదండరామ్ తెలపాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. 2014లో కూడా కాంగ్రెస్ పార్టీకి కోదండరామ్ పరోక్షంగా సహకరించారన్న విషయం తనకు తెలుసని.. కానీ ఇప్పుడు ఆయన ప్రత్యక్షంగా సహకరిస్తుండడం వల్ల ప్రజలకు ఆయన నైజం అర్థమవుతుందని అన్నారు. కోదండరామ్ వైఖరి పూర్తి స్వార్థపూరితమైన వైఖరి అని.. ఆయన మహాకూటమిలో కలసి ఉద్యమనేతలను అవమానించారని హరీష్ రావు అభిప్రాయపడ్డారు.

Trending News