మరోసారి కాల్పులతో ఉలిక్కిపడ్డ అమెరికా

Last Updated : Nov 6, 2017, 01:54 PM IST
మరోసారి కాల్పులతో ఉలిక్కిపడ్డ అమెరికా

అమెరికా మరోసారి కాల్పుల కలకలంతో ఉలిక్కిపడింది. ఆదివారం టెక్సాస్‌లోని ఓ చర్చిలో ఓ వ్యక్తి తుపాకీతో విచక్షణారహితంగా  కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 27 మంది చనిపోయారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. వీరిని సమీప ఆసుపత్రుల్లో చేర్పించి మెరుగైన వైద్య సహాయం అందిస్తున్నారు. 

సదర్లాండ్‌ స్ప్రింగ్స్‌ లో ఉన్న ఫస్ట్‌ బాప్టిస్ చర్చిలో సుమారు 11:30 గంటల సమయంలో  50 మంది ప్రార్థనలు చేస్తున్నారు. ఇంతలో ఆగంతకుడు నల్ల నల్లదుస్తుల్లో లోనికి ప్రవేశించి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో రెండేళ్ల చిన్నారి సహా 26 మంది అక్కడికక్కడే చనిపోయారు. స్థానికంగా ఉండే ఒక వ్యక్తి ఆదుకోవడంతో కొందరి ప్రాణాలైనా దక్కాయి. 

కాల్పుల ఘటన అనంతరం పారిపోతున్న దుండగుడిని  టెక్సాస్ భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. ఆగంతకుడు ఇదివరకు అమెరికన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేసిన కెల్లి అని గుర్తించారు. కాల్పులు పూర్తిగా ఆగిపోయినట్లు చర్చి ప్రార్థనల్లో పాల్గొన్న ఒక మహిళ  ఫేస్‌బుక్‌ లో పోస్ట్ చేశారు.

ఆసియా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు ఈ ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనలో  గాయపడినవారికి  మెరుగైన సాయం అందించాలని డోనాల్డ్ ట్రంప్ అధికారులను ఆదేశించారు. 

Trending News