కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం పాక్ సంచలన నిర్ణయం

పాకిస్థాన్‌లో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం కీలక నిర్ణయం తీసుకోనుంది.

Last Updated : Sep 1, 2018, 04:42 PM IST
కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం పాక్ సంచలన నిర్ణయం

పాకిస్థాన్‌లో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు పాకిస్థాన్ మానవ హక్కుల మంత్రి షిరీన్ మజారీ మాట్లాడుతూ, కాశ్మీర్ సమస్య పరిష్కారానికి ఇస్లామాబాద్‌లోని ప్రస్తుత ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఒక ప్రతిపాదనను సిద్ధం చేస్తోందని తెలిపారు.

పాకిస్థాన్‌కు చెందిన జర్నలిస్టు నాసిమ్ జహ్రా నిర్వహించిన ఒక చర్చలో మజారీ ఈ ప్రకటన చేశారు. 'పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) ప్రభుత్వం కాశ్మీర్ వివాదాన్ని ఒక వారంలోనే పరిష్కరించడానికి ప్రతిపాదన సిద్ధం చేస్తుంది. ఈ ప్రతిపాదనను కేబినెట్ ముందు ఉంచుతుంది. కేబినెట్‌లోని మంత్రులు దీనిపై చర్చిస్తారు. అలానే ఇతర ఉన్నతస్థాయి వ్యక్తులతో కూడా సమస్య పరిష్కారంపై చర్చిస్తారు. దాదాపు ప్రతిపాదన సిద్ధంగా ఉంది" అని మజారీ తెలిపారు. త్వరలోనే దీనిపై సమగ్ర సమాచారం అందిస్తామన్నారు.

జూన్ 25న పాకిస్థాన్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన మొదటి ప్రసంగంలో మాట్లాడుతూ.. 'భారత్‌తో మేము సత్సంబంధాలనే కోరుకుంటున్నాం. అన్ని అంశాలను పరిష్కరించుకోవాలని.. అందులో ప్రధానంగా కాశ్మీర్ సమస్యను ఇరుదేశాలు కూర్చొని, చర్చించుకోవాలి' అని అన్నారు. సమస్య పరిష్కారం కోసం భారత్ ఒకడుగు ముందుకేస్తే.. పాక్ రెండు అడుగులు ముందుకేస్తుందని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.  

అటు.. పాకిస్థాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ బాధ్యతలు చేపట్టాక భారత ప్రభుత్వం తొలిసారి ఆ దేశంతో అధికారికంగా సంప్రదింపులు జరపనుంది. బుధవారం లాహోర్‌లో సింధు జలాల వివాదంపై చర్చించనున్నారు.

అటు వచ్చే నెల 18న న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా.. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, పాక్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ సమావేశమయ్యే అవకాశం ఉంది.

 

Trending News