పాక్ ప్రధానిగా తడబడుతూ ప్రమాణస్వీకారం చేసిన ఇమ్రాన్ ఖాన్

పాకిస్తాన్ 22వ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన ఇమ్రాన్ ఖన్

Last Updated : Aug 18, 2018, 05:51 PM IST
పాక్ ప్రధానిగా తడబడుతూ ప్రమాణస్వీకారం చేసిన ఇమ్రాన్ ఖాన్

ఎట్టకేలకు ఎన్నో ఒడిదుడుకుల మధ్య ప్రధాని పదవికి తన మెజార్టిని నిరూపించుకున్న పాక్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఇవాళ ఆ దేశ 22వ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. క్రికెట్ కి గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన 22 ఏళ్ల తర్వాత పాకిస్తాన్-తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ నేడు పాక్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం పాకిస్తాన్ పార్లమెంట్‌ దిగువ సభలో జరిగిన విశ్వాస పరీక్షలో ఇమ్రాన్ భారీ ఆధిక్యంతో విజయం సాధించడంతో నేడు ఆయన ప్రమాణస్వీకారానికి మార్గం సుగుమమైంది. పాక్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్, ఇమ్రాన్ ఖాన్ చేత ఈ ప్రమాణస్వీకారం చేయించారు. ఉర్దూలో ప్రమాణస్వీకారం చేసే సమయంలో పలు ఉర్దూ పదాలను ఉచ్చరించడంలో ఇమ్రాన్ ఖాన్ తడబడిన వైనం మీడియా కంట పడకుండాపోలేదు. ఏదేమైనా ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడంతో పాకిస్తాన్‌లో గత రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న వంశపాలనకు తెరపడినట్టయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇస్లామాబాద్‌లోని పాక్ అధ్యక్షుడి భవనంలో జరిగిన ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి భారత్ నుంచి మాజీ క్రికెటర్లు నవజోత్ సింగ్ సిద్ధు, సునీల్ గవస్కర్, కపిల్ దేవ్‌లకు ఆహ్వానం అదింది. అయితే నవజోత్ సింగ్ సిద్ధూ మాత్రమే ఈ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు.

Trending News