సభ్యసమాజమా.. మా నగ్న శరీరాలతో చేయకు వ్యాపారం..!

ఈ రోజు దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో కొన్ని వేలమంది అతివలు వీధుల్లోకి వచ్చి బహిరంగంగా నిరసనను వ్యక్తం చేశారు.

Last Updated : Jul 8, 2018, 06:21 PM IST
సభ్యసమాజమా.. మా నగ్న శరీరాలతో చేయకు వ్యాపారం..!

ఈ రోజు దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో కొన్ని వేలమంది అతివలు వీధుల్లోకి వచ్చి బహిరంగంగా నిరసనను వ్యక్తం చేశారు. ఈ మధ్యకాలంలో కొరియాలో లైంగిక వేధింపులు ఎక్కువవుతున్నాయి. హిడెన్ కెమెరాలను ఉపయోగించి కొందరు వ్యక్తులు మహిళల బాత్ రూములు, బెడ్ రూముల్లోని దృశ్యాలను చిత్రీకరించి వాటిని ఇంటర్నెట్‌లో అప్ లోడ్ చేయడమో లేదా చూపించి బ్లాక్ మెయిల్ చేయడమో చేస్తున్నారు.

రోజు రోజుకీ ఈ కార్యకలాపాలు నిర్వహించే ముఠాలు ఎక్కువవడంతో మహిళల భద్రతకు భంగం వాటిల్లుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం వెంటనే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని కోరుతూ కొన్ని వేలమంది మహిళలు రాజధాని నడిబొడ్డుని ముట్టడించారు. దాదాపు 18000 మహిళలు ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారని అధికారిక అంచనా. ఎక్కువమంది బేస్ బాల్ క్యాపులు, సన్ గ్లాసులు, సర్జికల్ గ్లౌజులు ధరించి వచ్చి నిరసనల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా మహిళల అశ్లీల చిత్రాలను అప్ లోడింగ్‌కు స్వీకరించే వెబ్ సైట్లను కూడా బ్యాన్ చేయాలని రాజధాని నడబొడ్డున అతివలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రస్తుతం దక్షిణ కొరియాలో స్మార్ట్ ఫోన్ వాడకందారులు ఎక్కువగా ఉన్నారు. పెన్ కెమెరాలు కూడా ఉపయోగించి అశ్లీల చిత్రాలను తీస్తూ.. మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారు. గతంలో సోరానెట్ అనే వెబ్ సైటులో కొరియన్ మహిళల అశ్లీల చిత్రాలను ప్రదర్శించేవారు. అయితే ప్రభుత్వం ఆ సైటును బలవంతంగా మూయించి.. నిర్వాహకులపై చర్య కూడా తీసుకుంటామని తెలిపింది. తాజాగా దక్షిణా కొరియా ప్రధాని మూన్ జే ఈ సమస్యను ఒక కొలిక్కి తేవాలని భావించారు. హిడెన్ కెమెరాల ద్వారా అశ్లీల చిత్రాలు చిత్రీకరించే వారిపై తీవ్ర చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇలాంటి నేరాలు చేసేవారికి అయిదు సంవత్సరాల జైలుశిక్ష విధించడంతో పాటు10 మిలియన్ల కొరియన్ కరెన్సీని జరిమానాగా చెల్లించాలని కొరియన్ చట్టాలు చెబుతున్నాయి.

Trending News