6 నెలల పసికందును అమ్మి మొబైల్ ఫోన్ కొన్న కన్నతల్లి

6 నెలల పసికందును విక్రయించి మొబైల్ ఫోన్ కొనుగోలు చేసిన కన్నతల్లి

Last Updated : Sep 4, 2018, 07:14 PM IST
6 నెలల పసికందును అమ్మి మొబైల్ ఫోన్ కొన్న కన్నతల్లి

కన్నబిడ్డల కోసం ఎంతటి దుస్సాహసమైనా చేసే మాతృమూర్తులున్న ఈ ప్రపంచంలో తన 6 నెలల పసికందును అనాథాశ్రమానికి విక్రయించి, ఆ వచ్చిన సొమ్ముతో మొబైల్ ఫోన్ కొనుగోలు చేసింది ఓ తల్లి. పంచ్ మెట్రో ప్రచురించిన ఓ కథనం ప్రకారం.. నైజీరియాలోని ఎడో రాష్ట్రం బెనిన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనలో కన్న బిడ్డను విక్రయించిన నిందితురాలిని మిరాకిల్ జాన్సన్‌గా స్థానిక పోలీసులు గుర్తించారు. 2,00,000 నైజీరియన్ నైరాస్ (భారతీయ కరెన్సీలో రూ.40,000తో సమానం)కి చిన్నారిని విక్రయించిన ఆ యువతి.. అనంతరం అందులో కొంత మొత్తాన్ని వెచ్చించి ఓ మొబైల్ ఫోన్ కొనుగోలుచేసింది. 

చిన్నారి విక్రయం గురించి సమాచారం అందుకున్న పోలీసులు మిరాకిల్ జాన్సన్‌ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో తాను నేరం చేశానని అంగీకరించిన మిరాకిల్ జాన్సన్ అందుకు పశ్చాత్తాపం వ్యక్తంచేసింది. అయితే, అందుకు దారితీసిన పరిస్థితుల గురించి వెల్లడించే క్రమంలో జాన్సన్ ఒకదానికొకటి పొంతనలేని సమాధానాలు ఇచ్చింది. తన ఫ్రెండ్ ఒత్తిడి చేసిన కారణంగానే తాను తన బిడ్డను అమ్మేయాల్సి వచ్చిందని, ఆ వచ్చిన మొత్తంతో తన ఫ్రెండ్ ఒత్తిడిచేస్తేనే మొబైల్ ఫోన్ కొన్నానని ఓసారి చెప్పింది. అంతేకాకుండా బిడ్డను అమ్మగా వచ్చిన మొత్తంతో తన భర్తకు ఏదైనా వ్యాపారం పెట్టించి అతడికి సహాయపడవచ్చునని మరోసారి తన ఫ్రెండ్ ఒత్తిడి తీసుకొచ్చినట్టు జాన్సన్ పోలీసులకు చెప్పింది. 

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Trending News