రిలయన్స్‌ను ఎంపిక చేసింది మోదీ సర్కారే: బాంబు పేల్చిన హోలాండే

రఫెల్ డీల్: మోదీ సర్కార్‌కు షాకిచ్చిన ఫ్రాన్స్

Last Updated : Sep 22, 2018, 04:59 PM IST
రిలయన్స్‌ను ఎంపిక చేసింది మోదీ సర్కారే: బాంబు పేల్చిన హోలాండే

రాఫెల్ ఒప్పందంలో అనిల్ అంబానీకి చెందిన డిఫెన్స్ ఇండస్ట్రీస్‌ని భాగస్వామిగా డస్సాల్ట్ ఏవియేషన్ కంపెనీ ఎంపిక చేసుకోలేదని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే అన్నారు. ఈ పేరును భారత ప్రభుత్వమే ప్రతిపాదించిందని తెలిపినట్లు అక్కడి మీడియా పేర్కొంది.

ఫ్రెంచి మీడియాతో హోలాండ్‌ మాట్లాడుతూ ‘ఈ వ్యవహారంలో మా ప్రమేయం ఏమీ లేదు. భారత ప్రభుత్వమే ఆ గ్రూపు పేరును ప్రతిపాదించింది. ఆ మేరకు అనిల్‌ అంబానీ గ్రూపుతో డస్సాల్ట్ సంప్రదింపులు జరిపింది. ఎంచుకోవడానికి మాకు మరో కంపెనీ కూడా లేదు. భారత్ నిర్ణయించిన పార్ట్‌నర్‌నే మేం అంగీకరించి చర్చలు ప్రారంభించాం’ అని తెలిపారు. కాగా ఈ డీల్ నుంచి హెచ్ఎఎల్‌ను తొలగించి అంబానీకి కట్టబెట్టారని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్న నేపథ్యంలో హోలాండే వ్యాఖ్యలు కేంద్రాన్ని ఇరుకున పెట్టేలా ఉన్నాయి.

హోలాండ్‌ అధ్యక్షునిగా ఉన్న సమయంలోనే ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ 36 రాఫెల్‌ యుద్ధ విమానాలు కొనుగోలు చేయనున్నట్టు 2015 ఏప్రిల్‌ 10న పారిస్‌లో ప్రకటించారు.

దీనిపై రక్షణశాఖ అధికార ప్రతినిధి స్పందిస్తూ ఆ వార్తలోని నిజానిజాలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. దీనిపై బీజేపీ ఇంకా స్పందించనప్పటికీ.. ఆ పార్టీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి మాత్రం.. ‘ఒకవేళ ఆ వార్త నిజమైతే.. అది తీవ్రమైన అంశం’ అంటూ ట్వీట్‌ చేశారు. అటు ఈ అంశంపై స్పందించేందుకు న్యూఢిల్లీలోని ఫ్రెంచ్ ఎంబసీ నిరాకరించింది.

రాఫెల్‌ విషయంలో హోలాండ్‌ వ్యాఖ్యలను ఆసరాగా చేసుకుని బీజేపీపై కాంగ్రెస్‌ మరోసారి ఎదురుదాడికి దిగింది.‘‘ప్రధాని రహస్యంగా సంప్రదింపులు జరిపి ఒప్పందాన్ని మార్చారు. హోలాండ్‌ చెప్పడంతో ఈ విషయాన్ని మనం తెలుసుకున్నాం. అంబానీకి కోట్లాది రూపాయల కాంట్రాక్టును ఎలా ఇచ్చారో తెలుసుకున్నాం. ప్రధాని భారత్‌ను మోసగించారు. సైనికుల రక్తాన్ని అగౌరవపరిచారు’’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు.

కీలక వాస్తవాలను దాచిపెట్టి దేశ భద్రతను మోదీ ప్రమాదంలో పడేస్తున్నారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఆరోపించగా.. ఇప్పటికైనా నిజాలు బయటకు రావాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి ట్వీట్‌ చేస్తూ డిమాండు చేశారు.

 

Trending News