ట్రంప్, కిమ్ కలుసుకొనే చోటు ఇదే..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోన్ ఉంగ్‌ల భేటీ ఖరారైన సంగతి తెలిసిందే. 

Last Updated : May 1, 2018, 02:02 PM IST
ట్రంప్, కిమ్ కలుసుకొనే చోటు ఇదే..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోన్ ఉంగ్‌ల భేటీ ఖరారైన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు నేతలు ఇరు కొరియా దేశాల మధ్య ఉన్న ఓ నిస్సైన్య ప్రాంతంలో సమావేశమవుతున్నట్లు సమాచారం. సీఎన్‌ఎన్ వార్తల ప్రకారం ఇటీవలే జరిగిన కొరియా అధ్యక్షుల భేటీలో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూనేజే, కిమ్‌ను ట్రంప్‌తో భేటీకి ఒప్పించారని తెలుస్తోంది.

అలాగే వీలైతే అమెరికా-ఉత్తర కొరియాల మధ్య ఓ పెద్ద శిఖరాగ్ర సమావేశం జరిగే అవకాశం కూడా ఉందని వార్తలొస్తున్నాయి. మే నెలలో లేదా జూన్ నెలలో ఈ సమావేశం ఉండవచ్చని సమాచారం. ఇదే సమావేశంలో చరిత్రలోనే తొలిసారిగా అమెరికా, ఉత్తర కొరియా అధ్యక్షులు భేటీ అవుతారని అంటున్నారు. ఇటీవలే ట్రంప్ ఈ వార్తలపై స్పందించారు. ఇలాంటి శాంతి సదస్సుల్లో పాల్గొనేందుకు తన సంసిద్ధతను వ్యక్తం చేశారు. 

బహుశా ఈ సమావేశం దక్షిణ, ఉత్తర కొరియా దేశాల మధ్య ఉన్న పన్‌ముంజమ్ ప్రాంతంలోని పీస్ హౌస్‌లో లేదా సింగపూర్ దేశంలోని ఫ్రీడమ్ హౌస్‌లో గానీ నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు. ఇలాంటి సమావేశాలకు థర్డ్ పార్టీ దేశాలను కేంద్రాలుగా చేసుకోవడం సబబా? అని స్వయానా ట్రంప్ మళ్లీ సందేహాన్ని వ్యక్తం చేశారు.

ఇటీవలే ఇరు కొరియా అధ్యక్షులు కలిసి మాట్లాడుకున్న అంశం నచ్చిందని కూడా ఆయన అన్నారు. అయితే కొరియా, అమెరికా దేశాల శిఖరాగ్ర సదస్సు ఏర్పాటు సాధ్యమైనంత వరకూ సింగపూర్‌లో జరిగితేనే బాగుంటుందని అమెరికా భావిస్తోందని సీఎన్‌ఎన్ న్యూస్ తెలపడం గమనార్హం.

అయితే దూర ప్రాంతాలకు వెళ్లడానికి కిమ్ తన అనారోగ్య కారణాలను చూపుతుండడంతో ఈ సమావేశం ఎక్కడ జరుగుతుందన్న విషయంపై ఇప్పటి వరకూ ఎలాంటి స్పష్టత లేదన్నది మాత్రం నిజం. ఈ సమావేశం కొరియాకి దగ్గరగా ఉండే మంగోలియా దేశంలో కూడా జరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి

Trending News