పాక్‌కు అమెరికా ఆర్థికసాయం రద్దు

ఉగ్రవాదంపై అనుకున్నంత స్థాయిలో పోరాడేందుకు ప్రయత్నం చేయడం లేదని ఆరోపిస్తూ పాకిస్తాన్‌కు రూ.2,130 కోట్ల ఆర్థిక సాయాన్ని రద్దు చేయాలని అమెరికా భావిస్తోంది.

Last Updated : Sep 2, 2018, 08:38 PM IST
పాక్‌కు అమెరికా ఆర్థికసాయం రద్దు

ఉగ్రవాదంపై అనుకున్నంత స్థాయిలో పోరాడేందుకు ప్రయత్నం చేయడం లేదని ఆరోపిస్తూ పాకిస్తాన్‌కు రూ.2,130 కోట్ల ఆర్థిక సాయాన్ని రద్దు చేయాలని అమెరికా భావిస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్‌లో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేయాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరామని.. అయితే వారి నుండి స్పందన అనుకున్నంత స్థాయిలో లేదని ఈ సందర్భంగా అమెరికన్ లెఫ్టినెంట్ కల్నల్ కోనే ఫాల్కనర్ తెలిపారు.

తాలిబన్లకు పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (ఐఎస్ఐ) సహాయం చేస్తున్నట్లు తమకు తోస్తుందని.. ఇలాంటి చర్యలను తాము ఉపేక్షించమని ఫాల్కనర్ తెలిపారు. భారతదేశంపై ఉన్న వ్యతిరేక ధోరణి వల్లే.. అలాగే ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంతో భారత్ సత్సంబంధాలను పెంపొందించుకోవడం వల్లే పాకిస్తాన్ తాలిబన్లకు సహాయం చేస్తుండవచ్చని అమెరికా అభిప్రాయపడింది. ఏదేమైనా.. తొలుత పాకిస్తాన్ తన భూభాగంలో ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలు జరిగినా వాటికి అడ్డుకట్ట వేయాలని.. కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికా డిమాండ్ చేస్తోంది.

పాకిస్తాన్ వైఖరి అమెరికా అవలంబిస్తున్న పలు పాలసీలకు విఘాతం కలిగించే విధంగా ఉండడం వల్లే ఆర్థిక సహాయాన్ని నిలిపివేయాలని భావిస్తున్నామని అమెరికన్ సైన్యం తెలిపింది. ఈ మేరకు పెంటగన్ శనివారం ఒక ప్రకటనను విడుదల చేసింది. దక్షిణాసియాలో అమెరికా వ్యూహాలకు అనుగుణంగా నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడంలో పాకిస్తాన్ ప్రభుత్వం పదే పదే విఫలమవుతుందని పెంటగన్ తెలిపింది. గతంలో ఇదే విషయంలో హెచ్చరికలు జారీ చేసినప్పటికీ పాకిస్తాన్ పెడచెవిన పెట్టిందని అమెరికా తెలిపింది.

Trending News