నింగిలోకి దూసుకెళ్లిన 'పార్కర్ సోలార్ ప్రోబ్' వ్యోమనౌక

సూర్యుడికి అత్యంత దగ్గరకు వెళ్లేందుకు ఉద్దేశించిన వ్యోమ నౌక

Last Updated : Aug 12, 2018, 08:50 PM IST
నింగిలోకి దూసుకెళ్లిన 'పార్కర్ సోలార్ ప్రోబ్' వ్యోమనౌక

సూర్యుడికి అత్యంత దగ్గరకు వెళ్లేందుకు ఉద్దేశించిన వ్యోమ నౌక.. పార్కర్ సోలార్ ప్రోబ్ ను నాసా ఆదివారం ప్రయోగించింది. కేప్ కేనీవెరాల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్, ఫ్లోరిడా నుంచి దీన్ని నింగిలోకి పంపారు. డెల్టా ఫోర్ భారీ రాకెట్ ద్వారా ఈ ప్రోబ్ నింగిలోకి నిప్పులు చిమ్ముతూ దూసుకెళ్లింది. 150 కోట్ల డాలర్ల ఈ విలువైన ఈ వ్యోమనౌక విషయంలో ఇంజనీర్లు చాలా జాగ్రత్త వహిస్తున్నారని నాసా ఉన్నతాధికారి థామస్ జుర్బెచన్ పేర్కొన్నారు.  

నింగిలోకి పంపిన సోలార్ ఫ్రోబ్ వ్యోమ నౌక.. సూర్యుడి వాతావరణ వలయమైన కరోనాలోకి అతి దగ్గరగా వెళ్లనుంది. కరోనా పరిమాణం, చిత్రాలను తీసి నాసాకు పంపనుంది. దీంతో సౌర తుఫానులు, జ్వాలలు, భూమిపై ప్రభావంపై శాస్తవేత్తలు అధ్యయనం చేయనున్నారు. సూర్యుడిపైకి పంపిన తొలి రాకెట్ ఇదే.

 

మానవాళి ఇప్పటి వరకు నిర్మించిన వాటిలో అత్యంత వేగంగా ప్రయాణించే వాహనమిదే. గంటకు ఏడు లక్షల కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది. వచ్చే ఏడేళ్లలో సూర్యుడికి సమీపంగా వెళుతుంది. ఇది సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లినపుడు.. సూర్యుడి ఉపరితలానికి, సోలార్ ప్రోబ్‌కు మధ్య దూరం సుమారు నలభై లక్షల మైళ్లు ఉంటుందని శాస్తవేత్తలు వెల్లడించారు. దీనికమర్చిన ప్రత్యేక హీట్ షీల్డ్ వల్ల ఇది 1500 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతల్ని తట్టుకోగలదన్నారు.

సౌర తుఫాన్లు కక్ష్యలో తిరుగుతున్న శాటిలైట్లు మనకు సమాచారాన్ని అందించకుండా తీవ్ర అంతరాయం కలిగిస్తుంటాయి. ఈ సూరీడి విద్యుత్ తరంగాలని (సౌర తుఫాన్లు) భూమి పైన ఉన్న మనం ముందుగా పసిగట్టలేం. పార్కర్ సాయంతో ఇప్పుడు మనం వాటిని ముందుగానే పసిగట్టి ముందస్తు చర్యలు చేపట్టవచ్చు.

Trending News