మహిళా జర్నలిస్టును దారుణంగా హత్య చేసిన 10-12 మంది దుండగులు

దారుణ హత్యకు గురైన మహిళా పాత్రికేయురాలు సుబర్నా అఖ్తర్ నోడి

Last Updated : Aug 30, 2018, 12:09 PM IST
మహిళా జర్నలిస్టును దారుణంగా హత్య చేసిన 10-12 మంది దుండగులు

బంగ్లాదేశ్‌లో మహిళా జర్నలిస్టు సుబర్నా అఖ్తర్ నోడి (32)ని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఆనంద అనే ప్రైవేట్ న్యూస్ చానెల్‌ కి కరస్పాండెంట్ గా పనిచేస్తోన్న సుబర్నా బుధవారం తన ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. గతంలో జాగ్రోతో బంగ్లా అనే దినపత్రికతోపాటు బీడీన్యూస్24.కామ్ అనే న్యూస్ వెబ్‌సైట్‌కి ఆమె సేవలు అందించారు. ఢాకాకు 150 కిమీ దూరంలోని పాబ్నా జిల్లా రాధానగర్‌లో సుబర్నా తన 9 ఏళ్ల కూతురితో కలిసి నివాసం ఉంటున్నారు. పబ్నా జిల్లా ఏఎస్పీ ఇబ్నె మిజాన్ వెల్లడించిన వివరాల ప్రకారం మంగళవారం రాత్రి 10.45 గంటల ప్రాంతంలో 10-12 మంది దుండగులు మోటార్ సైకిల్స్ పై వచ్చి ఆమె ఇంటి కాలింగ్ బెల్ కొట్టారని, వారికి తలుపు వద్దే ఆమె సమాధానం చెప్పినప్పటికీ.. బలవంతంగా లోపలికి దూసుకొచ్చి పదునైనా ఆయుధంతో దాడిచేసి పారిపోయారని తెలుస్తోంది. 

రక్తపుమడుగులో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సుబర్నాను స్థానికులు ఆస్పత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆమె చనిపోయినట్టు అక్కడి వైద్యలు స్పష్టంచేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు అదనపు ఎస్పీ గౌతం కుమార్ బిశ్వాస్ తెలిపారు. సుబర్నా హంతకులను వెంటనే అరెస్ట్ చేసి వారికి తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ పబ్నాలోని జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. 

ఇదిలావుంటే, సుబర్నా అఖ్తర్ నోడి హత్య వెనుక ఆమె మాజీ భర్త రజిబ్ హుస్సేన్, మామ అబ్దుల్ హుస్సేన్ హస్తం ఉందని మృతురాలి తరపు బంధువులు అనుమానాలు వ్యక్తంచేసినట్టు ఢాకా ట్రిబ్యూన్ పేర్కొంది. సుబర్నా చనిపోయేముందు తన మాజీ భర్త రజిబ్ హుస్సేన్ పేరు చెప్పి చనిపోయిందని సుబర్నా తల్లి మీడియాకు తెలిపారు. దీంతో పోలీసులు ఆ కోణంలోనే కేసు దర్యాప్తు చేపట్టారు.

Trending News