ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్: తొలి రెండు స్థానాల్లో ఏపీ, తెలంగాణ

సరళీకృత వాణిజ్యం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలు తమ సత్తాను చాటాయి.

Last Updated : Jul 11, 2018, 05:07 PM IST
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్: తొలి రెండు స్థానాల్లో ఏపీ, తెలంగాణ

సరళీకృత వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలు తమ సత్తాను చాటాయి. 98.42 శాతం స్కోరుతో ఏపీ తొలిస్థానంలో నిలువగా, 98.33 శాతం స్కోరుతో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. సంస్కరణలు, కార్యాచరణ ప్రణాళిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ర్యాంకులను ప్రకటించగా తర్వాతి స్థానాల్లో హర్యానా, జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాలు నిలిచాయి. పెట్టుబడుల కోసం వివిధ రాష్ట్రాల మధ్య పోటీ పెరిగిన నేపథ్యంలో ఈ ర్యాంకులు ఆసక్తిగా మారాయి.

ఏపీ నెంబర్‌ వన్‌కు కారణాలు

ఏపీ నెంబర్‌ వన్‌కు పెట్టుబడులే కారణం. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ప్రకటిస్తూ వారి దృష్టిని ఆకర్షిస్తోంది. ఫలితంగా లక్షల కోట్ల పెట్టుబడులతో ఏర్పాటయ్యే కంపెనీల ద్వారా పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి. పొడవైన తీర ప్రాంతం, అపార ఖనిజ సంపద, విమానాశ్రయాల నిర్మాణం, విస్తరణ, నౌకాశ్రయాలు, నిరంతర విద్యుత్‌ సరఫరా, నీటి లభ్యత, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, పెట్టుబడి రాయితీలు, బకాయిల మాఫీ, తరచూ సంస్థలతో పరిశ్రమలకు సంబంధించిన సమావేశాలు నిర్వహించడం.. వీటన్నింటి కారణంగా రాష్ట్రంలో భారీగా పెట్టు బడులు పెట్టడానికి పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ముందుకు వస్తున్నాయి. సింగిల్‌విండో విధానం ద్వారా ఏపీ.. మిగతా రాష్ట్రాల కంటే మెరుగైన ఫలితాలను సాధిస్తోంది.

 ఏపీకి అభినందనలు-కేటీఆర్ ట్వీట్

సరళీకృత వాణిజ్యంలో కేవలం 0.09 శాతం పాయింట్లు తగ్గి మొదటి స్థానాన్ని కోల్పోయామని మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. అయినా సీఎం కేసీఆర్  నాయకత్వంలో అధికారులు మంచి పనితీరు కనబరిచి రెండవస్థానం దక్కించుకునేలా కృషి చేశారని కొనియాడారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సులభతర వాణిజ్యంలో అగ్రస్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్‌కు కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు.

 

Trending News