నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు: వాతావరణ శాఖ హెచ్చరిక

నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు: వాతావరణ శాఖ హెచ్చరిక 

Last Updated : Sep 25, 2019, 10:05 AM IST
నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు: వాతావరణ శాఖ హెచ్చరిక

న్యూఢిల్లీ : తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌తోపాటు దేశంలోని పలు ఇతర రాష్ట్రాల్లో బుధవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఢీల్లీలోని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా కోస్తాంధ్రా, రాయలసీమ, తెలంగాణ, యానాం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, కర్ణాటక, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడ, తూర్పు ఉత్తరప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, బిహార్, పశ్చిమబెంగాల్, అసోం, మేఘాలయ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, జార్ఖండ్, అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తమిళనాడు, లక్షద్వీప్, మాల్దీవ్స్ తీర ప్రాంతాల్లో అతి వేగంతో గాలులు వీస్తాయని.. మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాల్సిందిగా అధికారులు విజ్ఞప్తిచేశారు. తీర ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అధికారులు సూచించారు.

ఇదిలావుంటే, మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షంతో నగరం తడిసి ముద్దయింది. తెలంగాణలోని పలుచోట్ల సోమవారం నుంచే భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Trending News