గుంటూరు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్రా రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైనప్పటి నుంచి మొదలుపెడితే, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే వరకు చోటుచేసుకున్న పరిణామాలన్నీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆంధ్రాకు ముడిపెడుతూనే కొనసాగాయి. అయితే, కేసీఆర్ ప్రమాణస్వీకారం అనంతరం చోటుచేసుకుంటున్న కొన్ని చిన్న చిన్న ఘటనలు మాత్రం అంతకన్నా ఇంకా ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా చేబ్రోలులో తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కలిసి వున్న ఫ్లెక్సీ ఒకటి స్థానికంగా కలకలం సృష్టించింది.
ఈ ఏడాది జనవరి 1వ తేదీన పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌కి వెళ్లి అక్కడ సీఎం కేసీఆర్‌ని కలిశారు. ఆ సమయంలో కేసీఆర్‌కు పవన్ పుష్పగుచ్చం అందిస్తున్నప్పటి ఫోటోను ఉపయోగించుకుని ఈ ఫ్లెక్సీని రూపొందించారు. ఫ్లెక్సీపై ‘ధర్మం గెలిచింది, అధర్మం ఓడిపోయింది అని రాయించడంతోపాటు.. రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయుచున్న మా అన్న కేసీఆర్ గారికి ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ కేసీఆర్‌కు వారి శుభాకాంక్షలు అందజేశారు.
అసలే 2019లో ఏపీలో రానున్న ఎన్నికల్లో తమ ప్రతాపం ఏంటో చూపిస్తాం అని ఇప్పటికే కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో వెలుస్తున్న ఈ తరహా ఫ్లెక్సీలు ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనియాంశం అవుతున్నాయి. అసలు ఈ ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారు అనే విషయంలో సరైన స్పష్టత అయితే లేనప్పటికీ... అభిమానులు, పార్టీల కార్యకర్తలు తమ పార్టీల అధినేతల అనుమతి తీసుకున్న తర్వాతే ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారా లేక తమకు తాము సొంతంగా నిర్ణయం తీసుకుని ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారా అనే చర్చలు కూడా జరుగుతున్నాయి.