శ్రీలంక ప్రధానమంత్రి రానిల్ విక్రమసింఘే శుక్రవారం తిరుపతి వెంకటేశ్వరస్వామిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. 69 సంవత్సరాల విక్రమసింఘేకి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి ఆహ్వానించారు. పూర్తిగా సంప్రదాయ దుస్తులు ధరించి, సతీసమేతంగా ఆలయానికి వచ్చిన శ్రీలంక ప్రధాని శుక్రవారం సాయంత్రమే మరల తిరిగి చెన్నైకి వెళ్లి.. అక్కడ నుండి ఐఏఎఫ్ హెలికాప్టర్లో శ్రీలంకకు వెళ్లిపోయారు.
గతంలో 2002, 2016 సంవత్సరాల్లో తిరుమలకు విక్రమసింఘే వచ్చారు. ఇది ఆయన మూడవ సందర్శన. శ్రీలంక ప్రధాని తిరుమలకు వస్తున్నారన్న సమాచారం అందగానే.. ఆ పుణ్యక్షేత్రంతో పాటు చిత్తూరు మొదలైన ప్రాంతాలలో భారీగా పోలీసులను మోహరించారు. తన పర్యటనలో భాగంగా విక్రమ సింఘే మాట్లాడుతూ.. తనకు మంచి సౌకర్యాలు కల్పించిన భారత ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు. విక్రమ సింఘే తిరుమల పర్యటన ఆ పుణ్యక్షేత్ర పరిసర ప్రాంతాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. పోలీసులు మీడియాకి కూడా పలు ఆంక్షలను విధించడం జరిగింది.
తన తిరుపతి పర్యటనలో భాగంగా విక్రమసింఘే మాట్లాడుతూ విలేఖరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. "తమిళనాడులో డీఎంకే అధినేత కరుణానిధి గారు కోలుకోవాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఇదే విషయమై నేను ఇప్పటికే ఆయన కుమారుడు స్టాలిన్‌తో, కుమార్తె కనిమొళితో మాట్లాడాను" అని తెలిపారు. అలాగే శ్రీలంకలో భారత జాలర్లను అరెస్టు చేస్తున్న విషయంపై కూడా విక్రమసింఘే స్పందించారు. ప్రస్తుతం అలాంటి విషయాల్లో భారత్, శ్రీలంక ప్రభుత్వాలు చర్చల ద్వారా సమస్యల పరిష్కరానికి కట్టుబడి ఉన్నాయని తెలిపారు.