నల్లధనం నుండి కనీసం 15 పైసలు కూడా కేంద్రం తేలేకపోయింది: చంద్రబాబు

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జేఎన్టీయూ మైదానంలో చేపట్టిన ధర్మపోరాట సభ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర  ప్రభుత్వం భగవంతుడి పేరు చెప్పి మరీ ఓట్లు దండుకొని.. ఆ తర్వాత తిరుపతి వేంకటేశ్వరస్వామి సాక్షిగా నెరవేర్చాల్సిన హామీలే నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు

Last Updated : Jun 29, 2018, 09:08 PM IST
నల్లధనం నుండి కనీసం 15 పైసలు కూడా కేంద్రం తేలేకపోయింది: చంద్రబాబు

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జేఎన్టీయూ మైదానంలో చేపట్టిన ధర్మపోరాట సభ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం భగవంతుడి పేరు చెప్పి మరీ ఓట్లు దండుకొని.. ఆ తర్వాత తిరుపతి వేంకటేశ్వరస్వామి సాక్షిగా నెరవేర్చాల్సిన హామీలే నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు.

అలాగే నల్లధనాన్ని వెలికిదీసి  ప్రతీ ఒక్కరి ఖాతాల్లో 15 లక్షలు వేస్తానన్న కేంద్రం కనీసం 15 పైసలు కూడా వేయలేదని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రజలకు గుర్తుచేశారు. రాజధాని ఏర్పాటు కోసం అమరావతి  శంఖుస్థాపనకు వచ్చిన మోదీ కేవలం రూ.1500 కోట్లే ఇచ్చారని తెలిపారు. అలాగే నోట్లరద్దు వలన నేడు ఏటీఎంలలో డబ్బు లేకుండా పోయిందని.. దీనికి కేంద్రమే బాధ్యత వహించాలని చంద్రబాబు తెలిపారు. 

కేంద్రం హామీలు నెరవేర్చాలంటే పోరాటం ఒక్కటే మార్గమని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి అన్యాయం చేసినవారికి జనాలే ఏదో విధంగా బుద్ధి చెప్పాలని.. బీజేపీ అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ జనాలకు తీరని నమ్మకద్రోహం చేసిందని చంద్రబాబు అన్నారు. ఇది పిడికిలి బిగించి పోరాడే సమయమని.. విజయాన్ని కాంక్షించే అందరూ పోరుబాట పట్టాలని చంద్రబాబు తెలిపారు.

బీజేపీ హయాంలో బ్యాంకులపై నమ్మకం పోతోందని.. నీరవ్‌ మోదీ లాంటి వారు బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయారని.. అయినా కేంద్రం మీన మేషాలు లెక్కిస్తుందని చంద్రబాబు తెలిపారు. జరుగుతున్న పరిస్థితులను బట్టి కేంద్రానికి ప్రజలే బుద్ధి చెప్పాలని చంద్రబాబు కోరారు.

Trending News