సినీ దర్శకుడు రాజమౌళికి టీఆర్‌ఎస్ ఎంపీ కవిత ఛాలెంజ్

తెలంగాణ హరితహారంలో భాగంగా ఇగ్నైటింగ్‌ మైండ్స్, వాక్ ఫర్ వాటర్ సంస్థలు గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని చాలా వినూత్నమైన రీతిలో నిర్వహిస్తున్నాయి.

Last Updated : Jul 22, 2018, 12:35 AM IST
 సినీ దర్శకుడు రాజమౌళికి టీఆర్‌ఎస్ ఎంపీ కవిత ఛాలెంజ్

తెలంగాణ హరితహారంలో భాగంగా ఇగ్నైటింగ్‌ మైండ్స్, వాక్ ఫర్ వాటర్ సంస్థలు గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని చాలా వినూత్నమైన రీతిలో నిర్వహిస్తున్నాయి. తమకు తెలిసిన వారిచేత పచ్చని మొక్కలను నాటించడం ఈ ఛాలెంజ్ ముఖ్య ఉద్దేశం. ఇటీవలే హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ మొక్కలను నాటమని తెలంగాణ ఎంపీ కల్వకుంట్ల కవితకు ఛాలెంజ్ విసరగా.. ఆమె ఆ ఛాలెంజ్ స్వీకరించి అదే ఛాలెంజ్‌‌కు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళిలను నామినేట్ చేశారు. ఈ సందర్భంగా ఈ గ్రీన్ ఛాలెంజ్‌ను వారందరూ స్వీకరించారు.

పర్యావరణ సమతుల్యం పెరగాలంటే అందరూ పచ్చని మొక్కలు నాటాల్సిన అవసరం ఉందని.. అందుకు ఈ గ్రీన్ ఛాలెంజ్ కాన్సెప్ట్ ఎంతగానో ఉపయోగపడుతుందని కవిత అన్నారు. ఈ నెల 27న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతిని పురస్కరించుకొని.. ఇగ్నైటింగ్‌ మైండ్స్ సంస్థ గ్రీన్ ఛాలెంజ్ కాన్సెప్ట్‌కి నాంది పలికింది. తెలంగాణ హరితహారంను 2015 జూలైలో చిలుకూరు బాలాజీ దేవాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారికంగా ప్రారంభించారు.

2015లో తెలంగాణ ప్రభుత్వం హరితహారంలో భాగంగా రికార్డు స్థాయిలో హైదరాబాద్ నగరంలో ఒక్కరోజులోనే 25 లక్షల మొక్కలు నాటి వార్తల్లో నిలవడం జరిగింది. ఇదే హరితహారం పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ రెండు గ్రామాలకు ఒక నర్సరీ చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4,213 నర్సరీలు ఏర్పాటుచేశారు. హరితహారం పథకంలో భాగంగా ప్రభుత్వం అటవీ ప్రాంతంలోనే కాకుండా అన్ని రహదారులకు ఇరువైపులా, విద్యాలయాల్లో, పోలీస్ ప్రాంగణాల్లో, మార్కెట్ యార్డుల్లో, వ్యవసాయ క్షేత్రాల్లో, శ్మశాన వాటికలు, గ్రేవ్ యార్డుల్లో, పరిశ్రమల్లో, పారిశ్రామిక వాడల్లో, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాల్లో కూడా మొక్కలు నాటే ఏర్పాటు చేయడం గమనార్హం. 

Trending News