No Entry For CBI: తమిళనాడులో సీబీఐకు ప్రవేశం లేదిక, డీఎంకే ప్రభుత్వం కీలక నిర్ణయం

No Entry For CBI: దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ చుట్టు విమర్శలు చుట్టుముడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చెప్పుచేతల్లో ఉండే సంస్థగా రోజురోజుకూ ఆరోపణలు తీవ్రమౌతున్నాయి. ఇప్పుడు మరో రాష్ట్రం సీబీఐకు నో ఎంట్రీ అంటోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 14, 2023, 11:04 PM IST
No Entry For CBI: తమిళనాడులో సీబీఐకు ప్రవేశం లేదిక, డీఎంకే ప్రభుత్వం కీలక నిర్ణయం

No Entry For CBI: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థగా పేరుగాంచింది. కానీ గత కొన్నేళ్లుగా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటోంది. ఇప్పటికే సీబీఐని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రంలోని ప్రవేశించకుండా నిషేధించగా ఇప్పుడు మరో రాష్ట్రం ఆ జాబితాలో చేరింది. 

తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ అడుగుపెట్టకుండా నిర్ణయం తీసుకుంది. ఏ దర్యాప్తు సంస్థ అయినా రాష్ట్రంలో అడుగుపెట్టి దర్యాప్తు చేసుకునేందుకు వీలుగా గతంలో ఉన్న కన్సెంట్‌ను డీఎంకే ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అంటే గతంలో ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏ విధంగా సీబీఐకు నో ఎంట్రీ చెప్పిందో అదే విధంగా ఇప్పుడు స్టాలిన్ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని తీసుకుంది. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇకపై సీబీఐ రాష్ట్రంలో అడుగుపెట్టాలంటే ప్రభుత్వం అనుమతి తీసుకునే రావల్సి ఉంటుంది. అనుమతి లేకుండా దర్యాప్తు నిమిత్తం అడుగుపెట్టేందుకు వీల్లేదు. గతంలో ఏపీలో బీజేపీతో సంబంధాలు తెగదెంపులు చేసుకున్న తరువాత చివర్లో సీబీఐకు రాష్ట్రంలో ఉన్న కన్సెంట్‌ను వెనక్కి తీసుకుంది. ఆ తరువాత వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలో వచ్చాక ఆ కన్సెంట్‌ను తిరిగి ప్రవేశపెట్టింది. 

ఇప్పుడు తాజాగా తమిళనాడు ప్రభుత్వం సీబీఐకు నో ఎంట్రీ అనడంతో ఈ తరహా నిర్ణయం తీసుకున్న రాష్ట్రాల జాబితాలో చేరింది. ఇప్పటికే తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, కేరళ, జార్ఘండ్, పంజాబ్, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాలు సీబీఐ రాష్ట్రంలో ప్రవేశించే జనరల్ కన్సెంట్‌ను వెనక్కి తీసుకున్నాయి. ఈ రాష్ట్రాల్లో సీబీఐ అడుగుపెట్టాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి. లేదా సుప్రీంకోర్టు జోక్యంతో వెళ్లాల్సి ఉంటుంది. తాజాగా ఈ జాబితాలో తమిళనాడు చేరింది. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగపరుస్తూ తమకు నచ్చనివారిపై ఆ సంస్థల్ని ప్రయోగిస్తోందనేది ఈ రాష్ట్ర ప్రభుత్వాల ఆరోపణ. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాయి. ప్రతిపక్షాల నోరు నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్న సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థల్ని ప్రయోగిస్తోందనేది గత కొద్దికాలంగా ఉన్న విమర్శ. 

సీబీఐ సంస్థ వాస్తవానికి ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ ప్రకారం ఏర్పడింది. అంటే సీబీఐ పరిధి వాస్తవానికి ఢిల్లీకే పరిమితం. కానీ దర్యాప్తులో భాగంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి. ప్రతిసారీ అనుమతి తీసుకోవడం అనేది దర్యాప్తుకు జాప్యం కల్గిస్తుందనే భావనతో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగానే జనరల్ కన్సెంట్ అంటే సీబీఐ ఎప్పుడైనా ప్రవేశించేందుకు అనుమతి ఇస్తుంటాయి. అలాంటి జనరల్ కన్సెంట్‌ను ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. తమిళనాడు మంత్రి వి సెంథిల్ బాలాజీని మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే డీఎంకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. 

Also read: 8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ గిఫ్ట్.. త్వరలో ఊహించని ప్రకటన..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News