ఇండియాలో మొట్టమొదటి మొబైల్ కాలింగ్‌కు నేటితో 23 ఏళ్లు పూర్తి

జేబులో పట్టేలా ఉండే మొబైల్ ఫోన్ తో నేడు మనం ఎవరితోనైనా, ఎక్కడి నుంచైనా మాట్లాడగలుగుతున్నాం.

Last Updated : Jul 31, 2018, 07:49 PM IST
ఇండియాలో మొట్టమొదటి మొబైల్ కాలింగ్‌కు నేటితో 23 ఏళ్లు పూర్తి

జేబులో పట్టేలా ఉండే మొబైల్ ఫోన్‌తో నేడు మనం ఎవరితోనైనా, ఎక్కడి నుంచైనా మాట్లాడగలుగుతున్నాం. ఇంట్లో, బయట ఇలా ఎక్కడి నుంచైనా మాట్లాడగలుగుతున్నాం.  మాట్లాడటం అంటే గుర్తొచ్చింది.. దేశంలో మొట్టమొదటి మొబైల్ ఫోన్ కాలింగ్ ఎప్పుడు చేశారో తెలుసా? ఈరోజే..

ఈ రోజు అంటే ఈ రోజు అని కాదు.. సరిగ్గా 23 ఏళ్ల క్రితం ఇదే రోజు అన్నమాట. భారతదేశంలో తొలి మొబైల్ కాలింగ్‌కు నేటితో 23 ఏళ్లు పూర్తయ్యాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసు.. పీవీ నరసింహరావు ప్రభుత్వ హయాంలో సమాచార శాఖ మంత్రి సుఖ్ రామ్‌కు జులై 31, 1995 తేదిన మొట్టమొదటి మొబైల్ ఫోన్ కాల్ చేశారు. కోల్‌కతాలోని రైటర్స్ బిల్డింగ్ నుండి ఢిల్లీలోని సంచార్ భవన్ మధ్య ఈ కాల్ జరిగింది. ఈ కాల్ గురించి అప్పట్లో దేశంలో అన్ని ప్రముఖ పత్రికలతో పాటు ప్రపంచ పత్రికలు కూడా సంచలన వార్తగా ప్రచురించాయి.

మొబైల్ ఫోన్ వాడడం సులభమని, వేగంగా సమాచారం మార్చుకోవచ్చని, సమయం ఆదా అవుతుందని తెలియడంతో నాటి నుంచి భారత్‌లో మొబైల్ ఫోన్లు పెరుగుతూ వచ్చాయి. నేడు భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టెలికాం మార్కెట్‌గా అవతరించింది. ప్రపంచంలో చైనా తరువాత భారతదేశం మాత్రమే అత్యధికంగా మొబైల్ ఫోన్లు కలిగి ఉన్న దేశంగా మారింది. భారతదేశంలో 95 కోట్లకు పైగా మొబైల్ ఫోన్లు ఉన్నాయని అంచనా. ప్రస్తుతం మన భారతదేశం మొబైల్ ఫోన్ల వాడకంలో రెండో స్థానంలో ఉంది. ఇటీవలి కాలంలో మన దేశంలో సగటున 10 మందిలో సుమారు 8 మంది మొబైల్ ఫోన్లు వాడుతున్నట్టు అంచనా. ఇంటర్నెట్ మరియు మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (IAMI) మరియు కాంటార్- IMRB సంయుక్తంగా ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, డిసెంబర్ 2017 నాటికి మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 17.22 శాతం పెరిగి 45.6మిలియన్లకు చేరుకుంది.

Trending News