ఢిల్లీలో ఫ్రెంచి విద్యార్థినికి లైంగిక వేధింపులు.. స్నేహితురాలి తండ్రిపై ఆరోపణలు..!

ఢిల్లీలో ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎక్స్‌ఛేంజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా చదువుకోవడానికి వచ్చిన ఓ ఫ్రెంచి విద్యార్థిని తాను లైంగిక వేధింపులను ఎదుర్కొన్నానని తెలిపింది. 

Last Updated : Oct 29, 2018, 05:17 PM IST
ఢిల్లీలో ఫ్రెంచి విద్యార్థినికి లైంగిక వేధింపులు.. స్నేహితురాలి తండ్రిపై ఆరోపణలు..!

ఢిల్లీలో ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎక్స్‌ఛేంజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా చదువుకోవడానికి వచ్చిన ఓ ఫ్రెంచి విద్యార్థిని తాను లైంగిక వేధింపులను ఎదుర్కొన్నానని తెలిపింది. తాను ఎంతగానో నమ్మిన స్నేహితురాలి తండ్రే తనను వేధింపులకు గురిచేశారని ఆమె తెలిపింది. అక్టోబర్ 18వ తేదిన ఈ సంఘటన జరిగిందని.. అయితే స్నేహితురాలికి ఆ విషయం తెలపలేదని.. తమ క్లాస్ మేట్స్‌తో ఈ విషయాన్ని పంచుకున్నప్పుడు.. వారి ద్వారా ఈ విషయం ఓ ఫ్రెంచి టీచర్‌కి తెలిసిందని సదరు విద్యార్థిని తెలిపింది. ఆ ఫ్రెంచి టీచర్ వెంటనే భారత్‌లోని ఫ్రెంచి ఎంబసీకి సమాచారం అందించగా.. వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

ఢిల్లీ జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ దేవేష్ శ్రీవాస్తవ ఈ కేసుకు సంబంధించి విచారణకు ఆదేశించారు. ఆ తర్వాత ఆ అమ్మాయితో పాటు, ఫ్రాన్స్‌లో ఉన్న ఆమె తల్లిదండ్రులతో కూడా ఫోన్‌లో మాట్లాడారు. తర్వాత సదరు విద్యార్థినిని స్నేహితురాలి ఇంటి నుండి వేరే ఇంటికి తరలించారు. ఆమె భద్రత విషయంలో జాగ్రత్త వహించాలని.. నిఘా వ్యవస్థను పటిష్టం చేయమని పోలీసులకు తెలిపారు. 

ఈ కేసులో బాధితురాలైన ఫ్రెంచి విద్యార్థిని మాట్లాడుతూ "ఆమె నాకు ఫ్రాన్స్‌లో ఉన్నప్పుడే తెలుసు. మా మధ్య మంచి స్నేహం ఉంది. ఆమె కూడా స్టూడెంట్ ఎక్సేంజ్ ప్రోగ్రామ్ ద్వారానే ఇండియా నుండి ఫ్రాన్స్‌కు వచ్చింది. మా ఇంటిలో కూడా కొన్ని రోజులు ఉంది. అదే చొరవతో ఆమె పిలిచినప్పుడు వారి ఇంటికి నేను అతిథిగా వెళ్లాను. ఆమె తన తల్లిదండ్రులతో కలిసి ఎయిర్ పోర్టుకి వచ్చి నన్ను రిసీవ్ చేసుకుంది. అక్టోబర్ 13వ తేదిన తొలిసారిగా నేను వారి ఇంటికి వెళ్లాను. మొదట్లో ఆమె తండ్రి నాతో బాగానే ఉండేవారు. అక్టోబరు 18వ తేదిన ఆయన నాకు అసౌకర్యం కలిగేలా వ్యవహరించారు. నన్ను లైంగిక వేధింపులకు గురిచేశారు" అని తెలిపింది. ప్రస్తుతం ఆ ఫ్రెంచి విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు నెబ్ సెరాయ్ పోలీసు స్టేషనులో ఆమెను వేధింపులకు గురి చేసిన వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 354, సెక్షన్ 8 క్రింద కేసులు నమోదు చేశారు.

Trending News