ఐడియా - ఒడాఫోన్ ఇండియా విలీనానికి గ్రీన్ సిగ్నల్

భారతీయ టెలికాం రంగంలో మరో కీలకమైన పరిణామం

Last Updated : Jul 26, 2018, 09:25 PM IST
ఐడియా - ఒడాఫోన్ ఇండియా విలీనానికి గ్రీన్ సిగ్నల్

భారతీయ టెలికాం రంగంలో మరో కీలకమైన పరిణామం చోటుచేసుకోనుంది. రెండు పెద్ద టెలికాం కంపెనీలుగా పేరున్న ఐడియా, ఒడాఫోన్ ఇకపై ఒక్కటి కాబోతున్నాయి. ఆదిత్యా బిర్లా గ్రూప్‌కి చెందిన ఐడియా కంపెనీలో ఒడాఫోన్ ఇండియా విలీనం అయ్యేందుకు టెలికాం డిపార్ట్‌మెంట్ ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా మొత్తం 430 మిలియన్ల వినియోగదారులతో 35శాతం మార్కెట్ వాటా కలిగి వున్న ఈ నెట్‌వర్క్ సంస్థలు రెండూ త్వరలోనే ఒక్కటి కానున్నాయి. ఈ విలీనం అనంతరం ఇదే దేశంలోనే అతి పెద్ద నెట్‌వర్క్ కలిగి ఉన్న సంస్థగా అవతరించనుంది. టెలికాం డిపార్ట్‌మెంట్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇక ఈ విలీనం వ్యవహారం కంపెనీల రిజిస్ట్రార్ తలుపు తట్టనుంది. కంపెనీల రిజిస్ట్రార్ వద్ద సైతం అనుమతి వస్తే, ఆ తర్వాత ఈ రెండు నెట్‌వర్క్ సంస్థల విలీనానికి సంబంధించిన అధికారిక ప్రక్రియ పూర్తయినట్టవుతుంది.

ఐడియా సెల్యూలార్, ఒడాఫోన్ ఇండియా విలీనం కోసం ఈ రెండు సంస్థలు ఇప్పటివరకు ప్రభుత్వానికి బకాయిపడిన రూ.7,268.78 కోట్ల స్పెక్ట్రం చార్జీలను చెల్లించాల్సిందిగా జులై9న టెలికాం విభాగం విధించిన షరతు ప్రకారం సదరు సంస్థలు ఆ మొత్తాన్ని ఇటీవలే ప్రభుత్వానికి చెల్లించిన సంగతి తెలిసిందే. 

Trending News