బీజేపీ మంత్రుల రాజీనామాలకు.. జమ్మూ కాశ్మీర్ సీఎం ఆమోదం

జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తమ రాష్ట్ర ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న చంద్ర ప్రకాష్ గంగా, అటవీశాఖ మంత్రిగా ఉన్న లాల్ సింగ్ రాజీనామా పత్రాలను ఆమోదించారు. 

Last Updated : Apr 16, 2018, 12:20 AM IST
బీజేపీ మంత్రుల రాజీనామాలకు.. జమ్మూ కాశ్మీర్ సీఎం ఆమోదం

జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తమ రాష్ట్ర ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న చంద్ర ప్రకాష్ గంగా, అటవీశాఖ మంత్రిగా ఉన్న లాల్ సింగ్ రాజీనామా పత్రాలను ఆమోదించారు. వాటిని గవర్నర్ వద్దకు పంపారు. ఇటీవలే ఈ ఇద్దరు మంత్రులు కూడా వివాదంలో చిక్కుకున్నారు. కథువా అత్యాచార కేసులో నిందితులకు మద్దతు ఇస్తూ వీరు ర్యాలీలు నిర్వహించడంతో అనేక స్వచ్ఛంద సంస్థలు వీరిపై మండిపడ్డాయి.

రాష్ట్ర మంత్రులు నిందితులకు మద్దతు ఇవ్వడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో వారు ఈ రోజు తాము మంత్రి పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మంత్రులు ఇద్దరూ రాజీనామా చేయనున్నట్లు రాష్ట్ర బీజేపీ ప్రతినిధి సత్ శర్మ కూడా తెలిపారు. ప్రతిపక్షాలు కూడా ఈ మంత్రులు చేసిన పని పట్ల తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి.

ఈ క్రమంలో లాల్ సింగ్ మాట్లాడుతూ " నేను నైతిక విలువలను అనుసరించి రాజీనామా సమర్పించాను. నా వల్ల కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి.. నాకు ఆ పదవిలో ఉండే అర్హత లేదని భావించాను. అలాగే నేను ఆత్మసాక్షిగా చెప్పేదేమిటంటే.. హింసకు ప్రేరేపించే ఏ విషయాన్ని కూడా నేను సమర్థించను. అందుకే రాజీనామా చేస్తున్నాను" అని తెలిపారు.

అలాగే తాను కథువా అత్యాచారం కేసులో తక్షణం సీబీఐ ఎంక్వయరీ వేయాలని డిమాండ్ చేస్తున్నానని తెలిపారు. ఈ రోజే ఇదే కేసుకు సంబంధించి దేశ రాజధానిలో కేంద్ర హెచ్‌ఆర్‌‌‌డీ మంత్రి ప్రకాష్ జవదేకర్ స్పందించారు. "కాంగ్రెస్ నేత గులామ్ అహ్మద్ మిర్ మాట్లాడుతూ జమ్మూ స్థానికుల్లో ఈ కేసులో అసలైన నిందితులు తప్పించుకుంటున్నారనే భావన ఉంది అన్నారు. అలాగే ఇన్వెస్టిగేషన్ కూడా సరిగ్గా జరగడం లేదని అంటున్నారు. మరి ఎందుకు రాహుల్ ఆయన పై చర్యలు తీసుకోలేదు" అని జవదేకర్ ప్రశ్నించారు

Trending News