ఆ గ్యాంగ్‌స్టర్‌కి సల్మాన్ అంటే చంపేంత కోపం ఎందుకు ?

హుటాహుటిన అక్కడికి చేరుకున్న ముంబై పోలీసులు సల్మాన్‌ని కట్టుదిట్టమైన భద్రత మధ్య అంతా సినిమాలో ఓ సన్నివేశం మాదిరిగా యుద్ధప్రాతిపదికన ఇంటికి తీసుకెళ్లిపోయారు

Last Updated : Jan 12, 2018, 10:54 AM IST
ఆ గ్యాంగ్‌స్టర్‌కి సల్మాన్ అంటే చంపేంత కోపం ఎందుకు ?

సల్మాన్ ఖాన్‌ని చంపడానికైనా వెనుకాడను అని ఇటీవల రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ కోర్టు ఎదుట ఓ వ్యక్తి శపథం చేయడం సంచలనం సృష్టించింది. టైగర్ జిందా హై సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అవడంతో 2018లో శుభారంభాన్ని అందుకున్న సల్మాన్ ఖాన్‌కి ఈ బెదిరింపులు కాస్త అసౌకర్యానికి గురిచేసి వుంటాయనే చాక్ వినిపించింది. అంతేకాకుండా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ పాల్గొంటున్న రేస్ 3 సినిమా షూటింగ్ స్పాట్‌లోకి సైతం కొంతమంది ఆయుధాలతో ప్రవేశించారు అనే సమాచారంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న ముంబై పోలీసులు.. అతడిని కట్టుదిట్టమైన భద్రత మధ్య అక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్లారు. అది కూడా అంతా సినిమాలో ఓ సన్నివేశం మాదిరిగా యుద్ధప్రాతిపదికన జరిగిపోయింది.

గతంలో చాలామంది స్టార్ హీరోలు, హీరోయిన్స్‌కి ఇలాంటి బెదిరింపుల వచ్చాయి కానీ మరీ ఈ స్థాయిలో పోలీసులు సెక్యురిటీ కల్పించి మరీ అవతలి వారి కన్నుగప్పి ఎస్కార్ట్ చేసి తీసుకెళ్లిన సందర్భాలాలు లేవు. మరి పోలీసులు ఈసారి సల్మాన్ ఖాన్‌పై బెదిరింపులని అంత సీరియస్‌గా తీసుకోవడానికి కారణం ఏంటి ? సల్మాన్ ఖాన్‌ని చంపుతానని బెదిరించిన వ్యక్తి నిజంగానే అంత పవర్‌ఫుల్ క్రైమ్ రికార్డ్ వున్నవాడా అనే సందేహాలు తెరపైకొస్తున్నాయి. ఇప్పుడు చాలామంది బుర్రలని తొలిచేస్తున్న ఆ సందేహాలకి చిన్న సమాధానమే ఈ కింది వివరాలు. 

ఇంతకీ ఎవరా వ్యక్తి ?
ఇదిగో ఇతడే సల్మాన్‌ని చంపుతానని బెదిరించిన వ్యక్తి. పేరు లారెన్స్ బిష్ణోయ్. రాజస్థాన్‌కి చెందిన నొటోరియస్ గ్యాంగ్‌స్టర్స్‌లో లారెన్స్ బిష్ణోయ్ ఒకడు. వర్తకులని అపహరించి వారి వద్ద నుంచి భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నాడనే నేరం కింద పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జోధ్‌పూర్ కోర్టు ఎదుట హాజరుపరిచారు. అయితే, ఇప్పటివరకు పలుమార్లు తనని కోర్టు ఎదుట హాజరుపర్చిన పోలీసులు.. తనపై ఒక్క నేరాన్ని కూడా నిరూపించలేకపోయారని, ఒకవేళ తాను ఏదైనా పెద్ద నేరం చేయాలని పోలీసులు కానీ భావిస్తే కనుక, సల్మాన్ ఖాన్‌ని చంపడమే తాను చేసే పెద్ద నేరం అవుతుందని కోర్టుకి హాజరైన సందర్భంగా లారెన్స్ బిష్ణోయ్ శపథం చేశాడు.

లారెన్స్ బిష్ణోయ్‌కి, సల్మాన్ ఖాన్‌కి సంబంధం ఏంటి ?
అసలు సల్మాన్ ఖాన్ అంటే గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కి అంత కోపం ఎందుకు ? సల్మాన్‌ని చంపాల్సిన అవసరం లారెన్స్‌కి ఏం వుంది ? ఆ ఇద్దరి మధ్య వున్న సంబంధం ఏంటి ? శత్రుత్వం ఏంటనే కదా మీ డౌట్ !! అయితే, అక్కడికే వస్తున్నాం.. సల్మాన్ ఖాన్‌ని 1998 నుంచి ఏళ్ల తరబడిగా కోర్టుల చుట్టూ తిరిగేలా చేసిన కృష్ణ జింకల వేట కేసు పెట్టింది లారెన్స్ బిష్ణోయ్ సామాజికవర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. ఎప్పుడైతే ఆ సామాజిక వర్గం సల్మాన్ ఖాన్ తప్పు చేశాడని వేలెత్తి చూపిందో.. అప్పటి నుంచే వారు సల్మాన్ ఖాన్‌ని ఓ హీరోగా కాకుండా విలన్‌గా భావిస్తూ వస్తున్నారు. అందుకే అదే సామాజికవర్గానికి చెందిన వాడైన లారెన్స్ బిష్ణోయ్‌కి సైతం సల్మాన్‌పై కోపం వుండటం సహజ వైరమే అవుతుంది. అదండీ సంగతి !!

Trending News