Janasena-Tdp: రానున్న ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన సంచలనమైంది. రాజకీయాల్లో ఇప్పుడిదే చర్చ నడుస్తోంది. అయితే ప్యాకేజ్ బంధం ఇప్పుడు బయటపడిందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు అందుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
ఏపీలో తెలుగుదేశం-జనసేన పార్టీల పొత్తుపై అధికారిక ప్రకటన వెలువడింది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ ములాఖత్ అయ్యారు. నారా లోకేశ్, బాలకృష్ణతో కలిసి చంద్రబాబుతో దాదాపు 45 నిమిషాలు మాట్లాడారు. అనంతరం బయటికొచ్చి మీడియాతో మాట్లాడారు. టీడీపీ-జనసేన పొత్తుపై స్పష్టత ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఎన్డీయేలో ఉండటం వల్ల ఇప్పటి వరకూ ఆలోచించానన్నారు. ఇకపై ఆలోచించేది లేదని తెగేసి చెప్పారు. విడివిడిగా పోటీ చేస్తే వైసీపీ దౌర్జన్యాలు, అరాచకాలు మరో 20 ఏళ్లు కొనసాగుతాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. తనను కూడా ఏపీలో అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అందుకే ఇవాళ ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు.
మరోవైపు జనసేన-టీడీపీ పొత్తుపై ప్రకటన చేయగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు ప్రారంభించింది. ఎప్పట్నించో చెబుతున్నట్టుగానే ప్యాకేజ్ బంధం బయటపడిందని విమర్శించింది. పవన్ కళ్యాణ్ రాజమండ్రి జైలుకు వెళ్లిందే పొత్తు ఖాయం చేసుకునేందుకని ప్రజలు పూర్తిగా అర్ధమైందని వెల్లడించింది. ఇన్నాళ్లూ నీపై నమ్మకం పెట్టుకున్న అభిమానులకు కాస్తో కూస్తో నమ్మినోళ్లకు ఇవాళ భ్రమలు తొలగించేశావంటూ విమర్శలు గుప్పించింది. ఇక ఇది పొత్తులకు, ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధంగా వైసీపీ అభివర్ణించింది. మిమ్మల్ని అంటే టీడీపీ-జనసేనలు రాష్ట్రం నుంచి మూకుమ్మడిగా తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధమయ్యారని వైసీపీ ట్వీట్ చేసింది.
మరోవైపు చంద్రబాబు ప్రకటనపై మంత్రి అంబటి రాంబాబు, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు విమర్శించారు. పొత్తులపై ఇప్పుడే నిర్ణయం తీసుకున్నానంటే నమ్మే స్థితిలో ఎవరూ లేని మంత్రి అంబటి స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలో వంగవీటి రంగాను నడిరోడ్డుపై చంపినప్పుడు, ముద్రగడను అరెస్టు చేసినప్పుడు కాపుల మనోభావాలు దెబ్బతింటే మాట్లాడని వ్యక్తి ఇప్పుడు ప్రెస్‌మీట్ పెట్టి మరీ చంద్రబాబును పొగుడుతుంటే సిగ్గేస్తుందని కాపు కార్పొరేషన్ చైర్మన్ శేషు తెలిపారు.
Also read: TDP-Janasena Alliance: జనసేన-టీడీపీ పొత్తుపై క్లారిటీ, విస్పష్ట ప్రకటన చేసిన పవన్ కళ్యాణ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook