'టై'గా ముగిసిన భారత్-ఆప్ఘనిస్తాన్ మ్యాచ్

'టై'గా ముగిసిన భారత్-ఆప్ఘనిస్తాన్ మ్యాచ్

Last Updated : Sep 26, 2018, 08:44 AM IST
'టై'గా ముగిసిన భారత్-ఆప్ఘనిస్తాన్ మ్యాచ్

ఆసియాకప్ 2018లో భాగంగా భారత్-ఆప్ఘనిస్తాన్ మధ్య జరిగిన సూపర్‌-4 మ్యాచ్‌‌లో భారత్‌కు పసికూన ఆఫ్ఘనిస్థాన్ షాకిచ్చింది. 253 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్‌ను 49.5 ఓవర్లలో 252 పరుగులకే ఆలౌట్ చేయడంతో మ్యాచ్ 'టై' గా ముగిసింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్‌ అద్భుతంగా పోరాడి భారత్‌తో మ్యాచ్‌ను టైగా ముగించింది.

ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘాన్‌ 50 ఓవర్లలో 8 వికెట్లకు 252 పరుగులు చేసింది. అఫ్గాన్‌ ఇన్నింగ్స్‌లో వికెట్‌కీపర్‌ మహ్మద్‌ షెజాద్‌ (124; 116 బంతుల్లో 11×4, 7×6) శతకం బాదాడు. మహ్మద్‌ నబీ (64) అర్ధ సెంచరీ చేశాడు. జడేజాకు మూడు, కుల్దీప్ యాదవ్ కు రెండు వికెట్లు దక్కాయి. జాదవ్‌, దీపక్‌ చాహర్‌, ఖలీల్‌ అహ్మద్‌‌లకు చెరో ఒక వికెట్ దక్కింది.  

ఆ తర్వాత 253 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్‌ 49.5 ఓవర్లలో సరిగ్గా 252 పరుగులకు ఆలౌటయింది. రాహుల్ (60; 66 బంతుల్లో 5×4, 1×6), రాయుడు (57; 49 బంతుల్లో 4×4, 4×6)అర్ధ సెంచరీలో రాణించగా.. దినేశ్‌ కార్తీక్‌ (44) జడేజా (25) ఫర్వాలేదనిపించారు. మిగితావారు చేతులెత్తేయడంతో టీమిండియాకు విజయం దక్కలేదు. మూడు రనౌట్‌లు భారత్ కొంపముంచాయి. విన్నింగ్ షాట్ కొట్టే ప్రయత్నంలో చివరి వికెట్‌గా జడేజా 25 పరుగులకే ఔటయ్యాడు. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది. 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' షెహజాద్‌కు దక్కింది. కాగా.. ఈ టోర్నీలో భారత్‌ ఇప్పటికే ఫైనల్‌ చేరింది.

కాగా.. ఈరోజు ఆసియాకప్‌లో భాగంగా పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ ఆఖరి సూపర్‌-4 మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్లో భారత్‌తో తలపడుతుంది.

Trending News