హైదరాబాద్‌లో మరో కారు బీభత్సం.. హోటల్‌లో కూర్చున్న వ్యక్తి మృతి

హైదరాబాద్‌లో వరుస రోడ్డు ప్రమాదాలు నగరవాసులను హడలెత్తిస్తున్నాయి. ఎప్పుడు కారు మీద పడుతుందో, ఎటు నుంచి ప్రమాదం కబలిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.

Last Updated : Feb 19, 2020, 02:02 PM IST
హైదరాబాద్‌లో మరో కారు బీభత్సం.. హోటల్‌లో కూర్చున్న వ్యక్తి మృతి

హైదరాబాద్: భరత్ నగర్ ఫ్లై ఓవర్ మీద నుంచి కారు పడిపోయిన ఘటన జరిగి 24 గంటలు గడవకముందే హైదరాబాద్‌లో మరో ఘటన చోటుచేసుకుంది. నగర శివారు మియాపూర్‌లో బుధవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి పలు వాహనాలను ఢీకొట్టింది. అనంతరం సమీపంలోని ఓ హోటల్‌లోకి వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో హోటల్‌లో ఉన్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో నలుగురు వాహనదారులు సైతం గాయపడ్డారు. వరుస ప్రమాదాలతో వాహనదారులతో పాటు పాదచారులు సైతం హడలెత్తిపోతున్నారు.

గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వ్యక్తి పేరు అఫ్జల్ అని, ఓ ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. కారు నడిపిన నిందితుడు సంతోష్ మద్యం మత్తులో ఉన్నాడని, అందువల్లే వాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఒక్కసారిగా కారు హోటల్‌లోకి దూసుకెళ్లడంతో అక్కడున్నవారు భయాందోళనకు గురయ్యారు.

See Pics: అందాల గేట్లు ఎత్తేసిన భామలు 

కాగా, భరత్ నగర్-బల్కంపేట్ ఏరియాలో మంగళవారం (ఫిబ్రవరి 18న) వేకువ జామున అతివేగంతో వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి ఫ్లై ఓవర్ మీద నుంచి పడిపోగా, డ్రైవర్ సోహైల్ చనిపోయాడు. గతేడాది నవంబర్‌ నెలలో బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ మీదుగా అతివేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి కింద పడిపోయిన ఘటనలో ఓ మహిళ చనిపోగా, కొందరు వ్యక్తులకు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. కొన్ని రోజులపాటు మూసివేసి, వేగ నియంత్రణ రూల్స్ సవరించి, జాగ్రత్తలతో సేవల్ని పునరుద్దరించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి 

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News