70 ఏళ్లలో తొలిసారి ఓటు వేస్తా: గద్దర్

70 ఏళ్ల తర్వాత తొలిసారి ఓటు నమోదు చేసుకున్నానని ప్రజా గాయకుడు గద్దర్ తెలిపారు.

Last Updated : Oct 17, 2018, 07:27 PM IST
70 ఏళ్లలో తొలిసారి ఓటు వేస్తా:  గద్దర్

70 ఏళ్ల తర్వాత తొలిసారి ఓటు నమోదు చేసుకున్నానని ప్రజా గాయకుడు గద్దర్ తెలిపారు. ఈ సారి ఎన్నికల్లో ఓట్ల విప్లవం తేవాలన్నది తన ఆకాంక్ష అని ఆయన తెలిపారు. పెత్తందార్ల చేతిలో చిక్కుకుపోయిన తెలంగాణ తమకు వద్దని.. నవ తెలంగాణే లక్ష్యంగా అందరూ పాటుపడాలని గద్దర్ పిలుపునిచ్చారు. కార్పొరేట్ కుట్రదారుల చేతిలో బందీగా మారిపోయిన ఓటు విలువ సామాన్య ప్రజలు తెలుసుకున్నప్పుడే అనుకున్నది సాధించగలమని గద్దర్ అభిప్రాయపడ్డారు. తాను ఏ పార్టీకి కూడా చెందిన వ్యక్తిని కాదని.. గజ్వేల్ నుండైనా సరే తాను పోటీ చేసి నిలుస్తానని ఆయన అన్నారు. నిరంకుశదారుల ఆటకట్టించే తరుణమొచ్చిందని ఆయన అన్నారు.

నయా ఫ్యూడలిజం పేరుతో రూపాంతరం చెందుతున్న రాజకీయాలకు తాను వ్యతిరేకంగా పోరాడదలిచానని ఆయన అన్నారు. కామారెడ్డి జిల్లాకేంద్రంగా బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో గద్దర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణలో పరిస్థితులు మాత్రం మారలేదని.. ఇంకా అధికార పగ్గాలు పెత్తందార్ల చేతిలోనే ఉన్నానని.. ప్రజలు ఆ బానిసత్వపు సంకెళ్లు తెంచుకొని ఆత్మగౌరవంతో పోరాడాలని గద్దర్ పిలుపునిచ్చారు. 

మెదక్ జిల్లాలో జన్మించిన గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న గద్దర్... బుర్రకథ మాధ్యమంగా విప్లవగీతాలను జనాలకు పరిచయం చేశారు. కెనరా బ్యాంకులో క్లర్క్ ఉద్యోగాన్ని కొన్నాళ్లు చేసిన గద్దర్.. 1984లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1985లో కారంచేడులో దళిత హత్యలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో కూడా కళా ప్రదర్శనలు నిర్వహించారు. 1997లో పోలీసులకు, ఉద్యమకారులకు మధ్య జరిగిన దాడిలో గద్దర్ శరీరంలోకి బుల్లెట్లు దిగాయి. ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన పోరాటాల్లో కూడా గద్దర్ విరివిగా పాల్గొన్నారు. 

Trending News