MP Bandi Sanjay: సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖాస్త్రం.. ప్రభుత్వ హామీలను నెరవేర్చండి

MP Bandi Sanjay Letter to CM Revath Reddy: సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ తొలిసారి లేఖ రాశారు. మిడ్ మానేరు బాధితుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను డిమాండ్ చేశారు. లేఖలో ఆయన ఏం రాశారంటే..?   

Written by - Ashok Krindinti | Last Updated : Dec 18, 2023, 04:53 PM IST
MP Bandi Sanjay: సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖాస్త్రం.. ప్రభుత్వ హామీలను నెరవేర్చండి

MP Bandi Sanjay Letter to CM Revath Reddy: దీర్థకాలికంగా పెండింగ్‌ లో ఉన్న మిడ్‌ మానేరు బాధితుల సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ లేఖ సీఎం రేవంత్ రెడ్డికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు  అభినందనలు తెలిపారు. త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ నిర్వాకం వల్ల దశాబ్ద కాలంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వాటిని అధిగమిస్తూ ప్రజా అకాంక్షలకు అనుగుణంగా మీ పాలన కొనసాగాలని ఆకాంక్షించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఎన్నో ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న మిడ్‌ మానేరు ముంపు బాధితుల సమస్యలను, ప్రభుత్వం ఇచ్చిన హామీలను సీఎం దృష్టికి తీసుకువచ్చారు.

"ఉమ్మడి రాష్ట్రంలో 17 ఏండ్ల క్రితం కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టు మిడ్‌ మానేరు. లక్షలాది ఎకరాలకు సాగు నీటితోపాటు తాగునీటి అవసరాలను తీరుస్తుందనే భావనతో ప్రాజెక్టు ముంపు పరిధిలోని 12 గ్రామాల ప్రజలు ఇండ్లు, భూములు త్యాగం చేశారు. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 12 వేల 500 మంది బాధితులున్నారు. వీరికి సహాయ పునరావాస ప్యాకేజీ కింద 2005-06లో నాటి ప్రభుత్వం చేపట్టిన జీవో నెం.69 ప్రకారం ఐఏవై కింద ఇండ్లు మంజూరు చేసింది. ముంపు పరిహారం చెల్లిస్తామని పేర్కొంది. వీటి అమలులో తీవ్రమైన జాప్యం జరిగింది. 2018 జూన్‌ 15న నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారు ఈ ప్రాంతానికి వచ్చి మిడ్‌ మానేరు బాధితులకు ఐఏవై ఇండ్లకు బదులుగా డబుల్‌ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తామని, అందులో భాగంగా ఒక్కో బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల 4 వేలు చెల్లిస్తానని హమీ ఇచ్చారు.

12 గ్రామాల రైతులంతా సాగు భూమిని కోల్పోయిన నేపథ్యంలో నీలోజిపల్లి నుంచి నందిగామ, ఆగ్రహారం వరకు ఇండస్ట్రీయల్‌ కారిడార్‌ ను, స్కిల్‌ డెవలెప్‌ మెంట్‌ కాలేజీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తద్వారా వారిలో నైపుణ్యత పెంచి స్వయం ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు. అట్లాగే 2009 కొత్త గెజిట్‌ ప్రకారం తేదీ1-01-2015 నాటికి 18 ఏండ్లు నిండిన యువతీ యువకులకు ముంపు పరిహారం, పట్టా ఇస్తానన్నరు.కానీ నేటికి ఒక్క అడుగు ముందుకు పడలేదు.

రెండేళ్ల క్రితం మిడ్‌ మానేరు ముంపు బాధితుల కోసం కొదురుపాకలో నిర్వహించిన అఖిలపక్ష “మహాధర్నాలో మీరు, మీతోపాటు నేను హాజరై ముంపు బాధితులకు సంఘీభావం తెలిపాం. నాటి ధర్నాలో మిడ్‌ మానేరు బాధితుల సమస్యలను పరిష్కరించేదాకా వారి పక్షాన పోరాటం చేస్తామని, కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే వాటిని పరిష్కరిస్తామని మీరు హామీ ఇచ్చారు. అదే సమయంలో ముంపు పరిహారం చెల్లింపు విషయంలో అర్హత లేకపోయినా రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ రావు, ఆయన కుటుంబ సభ్యులతోపాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, బంధువులకు సైతం ప్యాకేజీ కింద పరిహారం చెల్లించారని, అధికారంలోకి వచ్చాక వీరిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. 

ఇటీవల మీరు అసెంబ్లీలోనూ ముంపు బాధితులకు న్యాయం చేస్తానని ప్రకటించడం సంతోషదాయకం. ఈ సందర్భంగా ఇక్కడి పార్లమెంట్‌ సభ్యుడిగా... మిమ్మల్ని మనస్పూర్తిగా ప్రత్యేకంగా అభినందిస్తూనే.. మరోసారి ఈ విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరి మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినందున మీరు తక్షణమే పెంచిన ఇండ్ల నిర్మాణ పరిహారాన్ని చెల్లించాలని కోరుతున్నాం. అదే విధంగా 2015 నాటికి 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు సైతం ప్యాకేజీని వర్తింపజేయాలి. ఆయా కుటుంబాలు సర్వం కోల్పోయినందున ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం.. నీలోజిపల్లి నుండి అగ్రహారం వరకు ఇండస్ర్రీయల్‌ కారిడార్‌ను, స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ కళాశాలను ఏర్పాటు చేసి స్వయం ఉపాధి కల్పించాలి.

అదే విధంగా అర్హత లేకున్నా ప్రభుత్వం నుండి లబ్ది పొందిన ఎంపీ సంతోష్‌ రావుతోపాటు మాజీ సీఎం బంధువులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, అదే సమయంలో అర్హులందరికీ న్యాయం చేయాలని విజప్తి చేస్తున్నాను. దీంతోపాటు వెంటనే సంబంధిత మంత్రి, స్థానిక శాసనసభ్యుడు, ప్రజా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి ముంపు బాధితుల సమస్యల పరిష్కారానికి యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా.." అని ఎంపీ బండి సంజయ్ లేఖలో రాసుకొచ్చారు.

Also Read: Google Trend Video: వీడు మగాడ్రా బుజ్జి..ఏకంగా 16 అడుగుల కింగ్ కోబ్రాకు ముద్దు పెట్టాడు..మీరే చూడండి..

Also Read: Tamil Nadu Road Accident: తమిళనాడులో కారు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ అయ్యప్ప భక్తులు మృతి   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News