ఖబడ్దార్.. అమెరికా : కిమ్ జోంగ్

Last Updated : Oct 2, 2017, 06:27 PM IST
ఖబడ్దార్.. అమెరికా : కిమ్ జోంగ్

గత కొంతకాలంగా సాగుతున్న ఉత్తర కొరియా, అమెరికాల మధ్య అరాచక రాజకీయాలు ఎలాంటి భవిష్యత్తు మారణహోమాలకు నాంది పలుకుతాయోనని ఆయా రాజ్యాల సరిహద్దు దేశాలు కలవరపడుతున్నాయి. అమెరికాను క్షమించేది లేదని.. దాని వినాశనమే తమ లక్ష్యమని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రతిజ్ఞ చేశారు. దాదాపు 2 లక్షల మంది దేశ పౌరులు ఆర్మీలో చేరిన క్రమంలో 'యాంటీ అమెరికా వార్'  అంటూ సాగిన స్లోగన్స్ మధ్య వారికోసం కిమ్ జోంగ్ ఒక ప్రత్యేక మీటింగును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అమెరికాను నాశనం చేయాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు.  ఆ రాజ్యానికి ఈ భూమండలంపై అసలు ఉనికి అనేదే లేకుండా చేయడమే తమ లక్ష్యమని కిమ్ బహిరంగ హెచ్చరికను జారీ చేశారు. 

ఈ సందర్భంగా తన సైనికులతో ఒక ప్రతిజ్ఞ చేయించారు. మన లక్ష్యం ఒక్కటే... అమెరికాలోని ప్రధాన నగరాలపై విరుచుకుపడడం అని ఆయన తెలియజేశారు. తమతో కలిసి పని చేసేందుకు దాదాపు 47 వేల మంది యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా సిద్ధంగా ఉన్నారని ఉత్తరకొరియా అధికారిక ప్రకటన విడుదల చేసింది. అమెరికాపై పోరాటం చేయాలంటే..  సైన్యాన్ని పెంచుకోవాలని... అందుకోసం యువతను కూడా ఆర్మీలోకి తీసుకోవడం మంచిదని కిమ్ భావించినట్లు అక్కడి మీడియా పత్రికల్లో వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలో సైన్యంలో చేరడం పట్ల పౌరులకు ఆసక్తిని కలిగించేందుకు ఆ దేశ ప్రభుత్వం పలు కార్యక్రమాలు కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. యుద్ధమే తమ అంతిమ లక్ష్యం కాబట్టి.. అందరూ దాని కోసం సిద్ధంగా ఉండాలని కిమ్ ప్రకటన జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈ క్రమంలో ఉత్తర కొరియాతో చర్చలు జరిపే అవకాశం ఉందన్న అమెరికా విదేశాంగ కార్యదర్శి రెక్స్ టిల్లెర్సన్ ప్రకటనపై డొనాల్డ్ ట్రంప్ అసహనాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు.. కిమ్ జోంగ్‌ను ఒక మెంటల్ పేషెంటుగా అభివర్ణించారు. కిమ్ జోంగ్ లాంటి మతిలేని వ్యక్తితో, అరాచకవాదితో సంప్రదింపులు అనవసరమని పేర్కొన్నారు. ఆయన అమెరికాను భయపెట్టేందుకు చేసే ప్రతి చర్యకి, ఫలితం అనుభవించాల్సి వస్తుందని తెలియజేశారు.

Trending News