సత్యరాజ్‌కు బ్రిటన్‌లో అరుదైన గౌరవం

బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్ర అందరికీ తెలిసిందే..!

Updated: Mar 12, 2018, 05:18 PM IST
సత్యరాజ్‌కు బ్రిటన్‌లో అరుదైన గౌరవం

బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్ర గురించి అందరికీ తెలిసిందే..! సత్యరాజ్‌ ఆ పాత్రలో కనబరిచిన భావోద్వేగాలు ఎవరినైనా కట్టిపడేస్తాయనడంలో సందేహం లేదు . బాహుబలి సినిమాలోని కట్టప్ప పాత్రతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సత్యరాజ్‌కు ఇటీవలి కాలంలో అరుదైన గౌర‌వం ల‌భించింది.  ప్రతిష్టాత్మక లండన్‌లోని మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో ఆయన మైన‌పు విగ్రహం కొలువుదీరనుంది. దీంతో ఆయన బ్రిట‌న్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహం పెట్టించుకోగలిగిన తొలి తమిళ నటుడిగా వార్తలలోకెక్కనున్నారు. ఎంజీఆర్, శివాజీ గణేశన్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులకు సాధ్యం కాని గౌరవాన్ని సత్యరాజ్ అందుకోనున్నారు.

బ్రిట‌న్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహం ఏర్పాటు చేయబోతున్నమనే విషయాన్ని ఇటీవలే మ్యూజియం అధికారులు చెప్పారని సత్యరాజ్ కుమారుడు శిబి సత్యరాజ్ తమిళ మీడియాకు  తెలిపారు. అంతకు ముందు ఇదే మ్యూజియంలో ప్రభాస్ మైనపు విగ్రహాన్ని నెలకొల్పిన విషయం తెలిసిందే..!