తమిళనాడులో హై టెన్షన్.. అప్రమత్తంగా ఉండాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు

Last Updated : Aug 7, 2018, 06:07 PM IST
తమిళనాడులో హై టెన్షన్.. అప్రమత్తంగా ఉండాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యం క్షిణిస్తోందని కావేరి ఆస్పత్రి వర్గాలు మంగళవారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేసిన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే కరుణానిధి చికిత్స పొందుతున్న కావేరి ఆస్పత్రితోపాటు గోపాలపురంలో ఉన్న కరుణానిధి నివాసం ఎదుట సైతం భారీ భద్రత ఏర్పాటు చేసింది ఆ రాష్ట్ర సర్కార్. 

కరుణానిధి ఆరోగ్య పరిస్థితిని వివరించేందుకు ఆయన తనయుడు, డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.కే. స్టాలిన్ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామితో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఎం.కే. స్టాలిన్‌తోపాటు ఆయన సోదరుడు ఎం.కే. అళగిరి, సోదరి కనిమొళి, బావ మురసొలి సెల్వన్, పార్టీ అగ్ర నేత టీ.ఆర్. బాలు, ఐ పెరియస్వామి ముఖ్యమంత్రిని కలిశారు. 

కరుణానిధి తాజా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి పళనిస్వామి భేటీ అయినట్టు తెలుస్తోంది. ఏ క్షణం ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కునేందుకు అధికార యంత్రాంగం, పోలీసులు సిద్ధంగా ఉండాల్సిందిగా ముఖ్యమంత్రి అధికారులకు సూచించినట్టు సమాచారం.

Trending News